- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పక్షమే విపక్షమైతే...?
దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పక్షమే విపక్షమై అక్కడి శాసనసభ్యురాలు అజ్మీర రేఖ నాయక్ సభ అధికార పార్టీని ఇరుకునపెట్టే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత చైర్మన్ అంకం రాజేందర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకే మెజారిటీ కౌన్సిలర్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చైర్మన్ రాజేందర్ సౌమ్యుడు అనే ముద్ర ఉన్నప్పటికీ అక్కడి రాజకీయ పరిణామాలు ఆయనపై అవిశ్వాసానికి ఉసిగొలుపుతున్నాయన్న చర్చ వినిపిస్తోంది.
అధికార పక్షమే విపక్షమై...
ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార భారత్ రాష్ట్ర సమితి సొంత పార్టీపైనే విపక్ష పాత్ర పోషిస్తున్నది. కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిన ఖానాపూర్ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో ఏడు వార్డుల్లో అధికార కౌన్సిలర్లు గెలుపొందారు. మిగతా ఐదుగురు విపక్షాలకు చెందినవారు. అయితే నాటకీయ పరిణామాల నడుమ అంకం రాజేందర్ చైర్మన్ గా గెలుపొందారు. ఎమ్మెల్యేకు నమ్మిన బంటుగా పేరు ఉంది అయితే కొంతకాలంగా మున్సిపల్ కౌన్సిలర్లు చాలామంది చైర్మన్ తోపాటు ఎమ్మెల్యేపై కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం ఉంది. దీనికి అభివృద్ధి పనుల లంకెను ముడిపెట్టి చైర్మన్ కు సహకరించడంలేదన్న ప్రచారం జరుగుతోంది. విపక్ష కౌన్సిలర్ల తీరును పక్కనపెడితే సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు వ్యతిరేకించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ మినహా మిగతా కౌన్సిలర్లు అందరూ జట్టు కట్టినట్లు తెలుస్తోంది.
వరుసగా నాలుగుసార్లు బడ్జెట్ మీటింగ్ కు డుమ్మా...
ప్రతి ఏటా మున్సిపల్ వార్షిక బడ్జెట్ ఆమోదించేందుకు మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ తమ వార్డుల అభివృద్ధికి సహకరించడం లేదని, నిధులు రావడంలేదనే కారణం చూపుతూ బడ్జెట్ సమావేశాలను కౌన్సిలర్లు బహిష్కరిస్తున్నారు. ఇదే నెలలో వరుసగా నాలుగు సార్లు బడ్జెట్ సమావేశాలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు రాష్ట్రంలోనే తొలిసారిగా వరుసగా నాలుగు సార్లు సమావేశాన్ని బహిష్కరించిన చరిత్రను ఖానాపూర్ లో సృష్టించారు. ఇది మున్సిపల్ నిర్వహణలో అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి
ఇరకాటంలో ఎమ్మెల్యే...
ఖానాపూర్ మున్సిపల్ రాజకీయాలు ఎమ్మెల్యే రేఖ నాయక్ ను ఇరకాటంలో పెడుతున్నాయి. మున్సిపాలిటీకి నిధులు విరివిగా వచ్చినప్పటికీ కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఏకపక్షంగా చైర్మన్ కు మద్దతు ఇవ్వడం వల్లనే తాము వ్యతిరేకిస్తున్నామని కౌన్సిలర్లు తమ అనుయాయుల వద్ద చెబుతున్నారు. చైర్మన్ కూడా తమ వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలు ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామాలు నియోజకవర్గంలో పార్టీకి మైనస్ గా మారుతున్నాయని అంటున్నారు.
కోర్టు తీర్పు తర్వాత అవిశ్వాసానికి రంగం సిద్ధం..?
మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున ఇప్పటికిప్పుడే చైర్మన్ పై అవిశ్వాసం పెట్టకపోవచ్చని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు మెజారిటీ కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నుంచి గెలిచినవారు ఎవరు చైర్మన్ పదవి కోసం పోటీ పడడం లేదని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాజుర సత్యం పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడే ఆయన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లతో క్యాంపునకు వెళితే జరిగే పరిణామాలపై కూడా ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ పరిణామాలు తారుమారై అధికార పక్షం ఆయనకు అవకాశం ఇస్తే ఖానాపూర్ మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా మారే పరిస్థితిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.