ఆగని గుట్కా దందా.. పోలీసుల దాడుల్లో బ‌య‌ట‌ప‌డుతున్న డంప్‌లు

by Anjali |
ఆగని గుట్కా దందా.. పోలీసుల దాడుల్లో బ‌య‌ట‌ప‌డుతున్న డంప్‌లు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: ఐదింతలు లాభం, భారీ డిమాండ్‌.. కొన్నాళ్లు అమ్మితే చాలు ఎడాపెడా సంపాదించొచ్చు. ఇవీ, నిషేధిత గుట్కా వ్యాపారానికి ప్రోత్సహిస్తున్న కారణాలు. దీంతో చాలామంది వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. ఆ మేరకు నిషేధిత గుట్కా పదార్థాలు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోకి గుట్టుగా, అక్రమ మార్గాల్లో గుట్టలుగుట్టలుగా వచ్చి పడుతున్నాయి. లారీల కొద్దీ గుట్కా తీసుకొస్తున్నారు అక్రమ రవాణాదారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలిగా పెద్దఎత్తున పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. పట్టుబడుతోంది.. కొంతలో కొంత. పట్టుబడకుండా తరలుతున్నది భారీగానే ఉంది. కర్ణాటక నుంచి ఇతర సరిహద్దు ప్రాంతాల ద్వారా అక్రమ మార్గాల్లో గుట్కా భారీగా జిల్లాకు వస్తోంది. పట్టుబడినా.. కఠినమైన చర్యలు లేకపోవడంతో నిర్భయంగా గుట్కా రవాణా, విక్రయాలు సాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా మత్తు పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా… ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుట్కా పాన్ మసాలా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా 24 గంటల వ్యవధిలోనే గోడౌన్లలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రూ. కోటి 21లక్షల 80 వేల విలువైన గుట్కా సంచులు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో అక్రమంగా నిలువ ఉంచిన రూ. 44.19 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తొలి రోజు ఆదివారం 77 లక్షల 60 వేల విలువైన గుట్కా సంచులు పట్టు పడగా, సోమవారం 44.19 లక్షల విలువైన గుట్కా నిల్వలు గుట్టురట్టు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు సరిహద్దున గల మహారాష్ట్రలోని యావత్ మాల్, నాగపూర్, చంద్రపూర్,నాందేడ్ జిల్లాలకు అక్రమ మార్గాల్లో చేరవేస్తూ వ్యాపారం సాగిస్తున్నట్టు తేలింది. పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లలో కర్ణాటకలో 20 బ్రాండ్ల పేరిట ఉత్పత్తి చేసి తెలంగాణ మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎస్.కె రహమతుల్లా, అర్బాజ్ ఖాన్, సైఫుల్ల ఖాన్, షమియుల ఖాన్, పసివుల ఖాన్, సాజిదుల్లా ఖాన్ లను పోలీసులు అరెస్టు చేశారు.

అక్క‌డి నుంచే అక్రమ రవాణా..

గుట్కా వ్యాపారం జిల్లావ్యాప్తంగా చాపకింద నీరులా సాగుతోంది. కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలోకి దిగి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్న గుట్కా మాఫియా ఈ వ్యాపారాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని మరింత జోరుగా సాగిస్తూ.. ప్రతినెలా లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. కర్ణాటకలో గుట్కా అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఉండడంతో వ్యాపారులు సునాయాసంగా కోట్లు సంపాదించే లక్ష్యంతో లారీల కొద్దీ సరుకును ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోనూ ప్రభుత్వం గుట్కా పాన్ మసాలా మత్తు పదార్థాలను నిషేధించడంతో వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గోడౌన్లను స్థావరాలుగా మలుచుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. పట్టణ కేంద్రాల నుండి పల్లెల వరకు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తూ రెట్టింపు ధరతో విక్రయిస్తూ కోట్లు గడుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.

కేసులు నమోదైనా..

పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా ఆ వ్యాపారాన్ని మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. ఈ వ్యాపారాన్ని కొత్త మార్గాల్లో కొనసాగిస్తున్నారు. రిమాండ్ అయినా బెయిల్పై వచ్చి మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో గుట్కా వ్యాపారిగా పేరుగాంచిన ఓ వ్యక్తి రూ.కోట్ల విలువైన సరకున జిల్లాకు తరలించి తన సోదరులతో కలిసి విక్రయిస్తున్నాడు. గతంలో కూడా ఆ వ్యాపారికి చెందిన రూ.కోటి విలువగల గుట్కాను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గుట్కా వ్యాపారులు ఇద్దరు కోట్లాది రూపాయ దందా సాగిస్తున్నారు. జిన్నింగ్ మిల్లులు, రాష్ట్ర సరిహద్దు (మహారాష్ట్రలోని) ప్రాంతాలు, మారుమూల ఇళ్లను అద్దెకు తీసుకుని నిల్వలు చేస్తూ జిల్లావ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. సాధారణ తంబాకును తీసుకొచ్చి ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ గుట్కాను సైతం విపణిలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed