'రోడ్లను కూడా నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది'

by Vinod kumar |
రోడ్లను కూడా నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది
X

దిశ, కాగజ్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి కాగజ్ నగర్ పట్టణంలో అధ్వానంగా మారిన రోడ్లను అభివృద్ధి చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని ఆరోపించారు. పట్టణాల్లో, గ్రామాల్లో చిన్నపాటి రోడ్లను కూడా నిర్మించలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కనీసం రోడ్లను కూడ నిర్మించలేని అసమర్ధ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గద్దె దిగిపోవాలని ధ్వజమెత్తారు. సిర్పూర్ నియోజకవర్గంలోని రోడ్లన్నీ అద్వాన్న స్థితికి చేరాయని అన్నారు. రాజీవ్ గాంధీ, అంబేడ్కర్ చౌరస్తాలతో పాటు ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు. వర్షాలు వస్తే గుంతల మయంగా మారి రోడ్డుపై బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు, గర్భిణీలు వెళ్లలేని పరిస్థితులు దాపురించాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ముందు ఆగమేఘాల మీద వందల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రోడ్లన్నీ అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు సిర్పూర్‌లో ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి అభివృద్ధి గుర్తుకొస్తుందని విమర్శించారు. అనంతరం ఈస్గామ్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఈస్గామ్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈస్గామ్ వీధులన్నీ జై ఆర్ఎస్పీ, జై బీఎస్పీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, షేక్ చాంద్ పాష, ముస్తాఫిజ్, మనోహర్, రాంప్రసాద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story