అధ్వానంగా మారిన రహదారులు.. రోడ్లు ఇలా ప్రయాణం ఎలా..?

by Mahesh |
అధ్వానంగా మారిన రహదారులు.. రోడ్లు ఇలా ప్రయాణం ఎలా..?
X

దిశ, వేమనపల్లి: స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ వేమనపల్లి మండలంలో సరైన రవాణా సౌకర్యం లేదు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పల్లెల్లోనే ఉండాలని గొప్ప గొప్ప నేతలు కలలు కన్నప్పటికీ అవి కలలుగానే నిలిచిపోయాయి. కంప్యూటర్ యుగంలో మనిషి పోటీపడి మేధాశక్తిని పెంపొంది అంతరిక్షంలో అడుగుపెడుతున్న ఈ రోజుల్లో రవాణా సౌకర్యం లేక మండల వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు, అధికారులు రవాణా సౌకర్యం పై శ్రద్ధ చూపకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో రహదారులు అద్వానంగా మారాయి. మండల కేంద్రం నుండి బెల్లంపల్లి నియోజకవర్గం వెళ్లే ప్రధాన రహదారి నాగారం అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి లేకపోవడంతో బురద రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై ప్రైవేటు వాహనాలలో ప్రజలంతా ప్రయాణం కొనసాగిస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ బస్సు సేవలు కూడా ప్రజలకు అందడం లేదు. మరోవైపు మండల కేంద్రం నుండి చెన్నూరు వెళ్లే ప్రధాన రహదారి గొర్లపల్లి వాగు నుంచి నిల్వాయి అటవి సమీపం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు గుంతల మయంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. గతంలో రవాణా వ్యవస్థ లేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు మార్గమధ్యలో చనిపోయిన అనేక సంఘటనలు ఉన్నాయి.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

చెన్నూరు నుండి ముల్కల పేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం ముల్కలపెట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో అదుపుతప్పింది. రోడ్డు దిగి వరి పొలాల్లోకి వెళ్లే సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ రహదారి బీటీ రోడ్డు ఉన్నప్పటికీ వర్షాకాలంతో ట్రాక్టర్ కేజీ వీల్స్‌తో తిరగడంతో వరి పొలాల్లోని మట్టి బుడద అంత బీటీ రోడ్లపై చేరడంతో బురద కారణంగానే బస్సు అదుపు తప్పింది.

ప్రైవేటు వాహన దోపిడీకి అడ్డే ది

మండల కేంద్రం నుండి నాగారం లక్ష్మీపూర్ జిల్లెడ వరకు 10 నుండి 15 కిలోమీటర్ల మేర దూరానికి ప్రైవేటు వాహన దారులు ఇష్టానుసారంగా ప్రయాణికుల నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. పరిమితికి మించిన ప్రయాణికులను చేరవేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.

పాలకులు, అధికారుల పట్టింపు కరువు

మండలంలో రవాణా సౌకర్యం మెరుగుపడేందుకు రహదారుల నిర్మాణం దిశగా కృషి చేయాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే మండలంలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయని, కొత్త రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం తో మండలంలోని ప్రయాణికుల ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తూ.. గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. గొల్లపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. నీల్వాయిలో డబుల్ రోడ్డు నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టినప్పటికీ నేటికీ పూర్తి చేయలేదు. సగానికి పైన గ్రామాలకు నేటికీ మట్టి రోడ్లు ఉన్నాయి. అవి వర్షాకాలంలో బురదమయంగా తయారవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి మండలంలోని రహదారులను నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని, బీటీ రోడ్లపై క్రేజీ వీల్స్ తిరగకుండా, ప్రవేటు వాహనాదారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed