Nirmal Collector : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలి

by Aamani |
Nirmal Collector : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలి
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరచాలని, పరిష్కారానికి సంబంధించిన వివరాలను సంబంధిత దరఖాస్తుదారునికి అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, గన్ని బ్యాగ్స్, టార్ప లీన్, వేయింగ్ మిషన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ హాస్టలను నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈనెల 6న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్ల నమోదు ప్రక్రియ గడువు ముగుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed