2024 US elections: అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు 9 మంది భారతీయులు పోటీ..!

by Shamantha N |
2024 US elections: అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు 9 మంది భారతీయులు పోటీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలే(US elections) కాకుండా కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభకు(US House of Representatives) కూడా పోలింగ్ జరగుతోంది. కాగా.. కాంగ్రెస్ ప్రతినిధుల సభకు మొత్తం 9 మంది భారతీయులు పోటీపడుతున్నారు. వారిలో ఐదుగురు మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వర్జీనియా నుంచి 38 ఏళ్ల సుహాస్‌ సుబ్రహ్మణ్యం(Suhas Subramanyan) పోటీ చేస్తున్నారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి పోటీ చేస్తున్న ఆయనకు.. ఆయనకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. సుహాస్ కాంగ్రెస్‌కు ఎన్నికైతే మాత్రం తొలిసారి ఈ రాష్ట్రం నుంచి గెలిచిన ఇండో-అమెరికన్‌గా రికార్డు సృష్టించనున్నారు. సుహాస్ గతంలో ఆయన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శ్వేతసౌధంలో సహాయకుడిగా పనిచేశారు.

ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారంటే?

కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డాక్టర్‌ అమిబెరా(Dr Ami Bera) మరోసారి బరిలో నిలిచారు. 59 ఏళ్ల అమి 2013 నుంచి ఈ స్థానంలో గెలుస్తూనే ఉన్నారు. ఈసారి డెమొక్రాట్లకు ప్రతినిధుల సభలో ఆధిక్యం వస్తే.. అమికి కీలక పదవి దక్కే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రమీలా జయపాల్‌ పోటీలో ఉన్నారు. 2017 నుంచి ఆమె ఇక్కడ విజయం సాధిస్తూనే ఉన్నారు. 59 ఏళ్ల ఆమె డెమొక్రటిక్‌ పార్టీలో పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. ఇక, ఇల్లినాయిస్‌ 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రాజా కృష్ణమూర్తి ఎన్నికల బరిలో నిలిచారు. 2017 నుంచి ఆయన ఇక్కడ విజయం సాధిస్తున్నారు. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రో ఖన్నా పోటీలో ఉన్నారు. ఆయన కూడా గత ఏడేళ్ల నుంచి గెలుస్తూ వచ్చారు. మిషిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి శ్రీ తానేదార్‌ బరిలో ఉన్నారు. కాగా.. ఇల్లినాయిస్, మిషిగాన్, కాలిఫోర్నియా ప్రాంతాల్లో డెమొక్రాట్లకు మంచి పట్టు ఉంది. అరిజోనా స్టేట్‌ అసెంబ్లీలో వరుసగా 2018, 20, 22ల్లో విజయం సాధించిన డాక్టర్‌ అమిష్‌ షా ఈసారి ప్రతినిధుల సభ బరిలోకి దిగారు. అరిజోనా తొలి కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీపడుతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి కన్సాస్‌ 3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీపడుతున్నారు. డాక్టర్‌ రాకేశ్‌ మోహన్‌ న్యూజెర్సీ 3వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభ బరిలో ఉన్నారు..

1957లో తొలిసారిగా..

కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి 1957లో తొలిసారి దలీప్‌ సింగ్‌ సంధూ విజయం సాధించారు. అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టిన తొలి ఇండో-అమెరికన్‌ ఆయనే. మొత్తం మూడుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2005లో బాబీ జిందాల్‌ లూసియానా నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఆ రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.

Advertisement

Next Story