second capital: రెండో రాజధానిపై రేవంత్ సర్కార్ ఫోకస్!

by Prasad Jukanti |
second capital: రెండో రాజధానిపై రేవంత్ సర్కార్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : చారిత్రక నగరం వరంగల్‌ను (Warangal) తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధాని (Second Capital) గా మార్చేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయా? త్వరలోనే రాష్ట్ర రెండో రాజధానిగా అనౌన్స్ చేయబోతున్నారా? ఈ విషయంలో ప్రభుత్వం వేగం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. వరంగల్‌ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు చేయగా తాజాగా ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధిపై మంత్రులు కీలక భేటీ నిర్వహించారు. వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్‌లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti), పొన్నం ప్రభాకర్ (Ponnam) ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి (Vem Narender Reddy), వరంగల్ మేయర్ గుండు సుధారాణితోపాటు పలువురు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్‌అండ్‌బీ, ఎంఎయూడీ ఉన్నతాధికారులు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్‌లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్..

వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని రెండురోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. కాగా గత జూన్‌లో వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వరంగల్ హెరిటేజ్ సిటీగా వరంగల్ డెవలప్ చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు రచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేట్ సిస్టంను డెవలప్ చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధి విషయంలో 20 రోజులకు ఓసారి ఇన్‌చార్జి మంత్రి అధికారులతో సమావేశం కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ అభివృద్ధిపై మంత్రులు దృష్టిసారించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story