తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు..

by Sumithra |
తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు..
X

దిశ, ఇచ్చోడ : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బెల్ట్ షాపు దందా జోరుగా సాగుతోంది. అధిక ధరలకు బెల్టు యాజమాన్యాలు జేబులు నింపుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులలో తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అయినా కూడా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు...

విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోంది. ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు విపిస్తున్నాయి.

మత్తుకు బానిసవుతున్న యువత..

గ్రామాల్లో గల్లీగల్లీకో బెల్ట్ షాపు వెలుస్తుండడంతో యువకులు మద్యానికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అప్పులు చేసి మరి అధిక ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. బెల్ట్ షాపుల్లో వేకువజామున మద్యం దొరుకుతుండడంతో మండల వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్​ పార్టీ హామీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ పార్టీ గ్రామాల్లోని బెల్ట్​ దుకాణాలను ఎత్తి వేస్తామని హామీ ఇచ్చింది. గ్రామాల్లో బెల్ట్​ దుకాణాలను ఎత్తివేయాలని సర్కార్​ ఆదేశాలు జారీ చేసింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందని విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామాల్లో బెల్ట్​ దుకాణాలు మూసివేయాలని ఆదేశించినప్పటికీ గ్రామాల్లో తిరిగి మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలను అధికారులు అడ్డుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అబ్కారీ శాఖ అధికారుల ప్రోత్సాహంతోనే గ్రామాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా పట్టించుకోక పోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా అబ్కారీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లిప్తతతో మద్యం కల్తీ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ విపరీతంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వైన్‌ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు అందుకుంటున్న అబ్కారీశాఖ అధికారులు మద్యం మత్తులో జోగుతున్నారనే బహిరంగ ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story