మంచిర్యాలలో ఇసుక బకాసురులు

by Nagam Mallesh |
మంచిర్యాలలో ఇసుక బకాసురులు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరోః ఆయ‌నో మాజీ స‌ర్పంచ్‌.. గ‌తంలో సామాన్యంగా బ‌తికిన వ్య‌క్తి.. ఆయ‌న కొద్ది రోజుల్లోనే అసామాన్యుడ‌య్యాడు.. కోట్లు సంపాదించాడు. ఇసుక క్వారీ కోసం ఏకంగా రూ. 25 ల‌క్ష‌లు పెట్టి మ‌రీ విజ‌యం సాధించాడంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు... ఇలా ఆయ‌న ఒక్క‌డే కాదు.. ఇసుక పేరుతో కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకుంటున్నారు. అయితే, క్వారీలో ప్ర‌భుత్వ అనుమ‌తులు తీసుకుని వ్యాపారులు వ్యాపారం చేస్తుంటే చుట్టు ప‌క్క‌ల నేత‌లు ఎలాంటి పెట్టుబ‌డులు లేకుండానే ఎదుగుతున్నారు.

గోదావ‌రి తీరంలో ఉన్న నాయ‌కులు, వ్యాపారుల‌కు ఇసుక దందా కోట్లాది రూపాయ‌లు కురిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ ఉండే ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డ‌గోలుగా సంపాదిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలో ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్క‌డి ఇసుక‌కు భారీగా డిమాండ్ ఉంది. దీంతో టీజీఎండీసీ రీచ్ లు ఏర్పాటు చేసింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇసుక‌ను ఇష్టారాజ్యంగా త‌ర‌లించుకుపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా రాత్రివేళ‌ల్లో అధికారులు, సిబ్బందికి తెలియ‌కుండా పెద్ద ఎత్తున ఇసుక ప‌క్క‌దారి ప‌డుతోంది. బుధ‌వారం రాత్రి ఇలా బ‌య‌ట‌కు వెళ్తున్న లారీని ప‌ట్టుకుని పోలీస్ ఠాణాకు అప్ప‌గించారు. అయితే, రెండు వాహ‌నాల్లో ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతుండ‌గా, కేవ‌లం ఒక్క లారీ మాత్ర‌మే అధికారులు ప‌ట్టుకున్నారు.

పెద్ద ఎత్తున త‌ర‌లుతున్న ఇసుక‌..

టీజీఎండీసీ అధికారులు ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ య‌థేచ్ఛ‌గా రాత్రి వేళ‌ల్లో త‌ర‌లివెళ్తూనే ఉంది. గోదావరి నదిలోని ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. టీజీఎండీసీ పేరిట లారీల యజమానులు చెల్లించిన మొత్తం కంటే ఐదారు టన్నులు అధికంగా లారీల్లో ఇసుకను లోడింగ్‌ చేస్తున్నారు. ఒక్కో లారీ నుంచి రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. క్వారీల వద్ద దోపిడీ, అక్రమాలపై టీఎస్‌ఎండీసీ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని లారీ యజమానులు వాపోతున్నారు.

మాజీ స‌ర్పంచ్ పాత్ర‌ధారి.. సూత్ర‌ధారి..

అయితే, ఇదే ప్రాంతానికి చెందిన ఓ మాజీ స‌ర్పంచ్ ఈ వ్య‌వ‌హారానికి మొత్తం వెన‌క ఉండి న‌డిపిస్తున్నాడు. ఎవ‌రికి ఎంత ముట్ట‌చెప్పాలి..? ఎలా చేయాలి..? అనే వ్య‌వ‌హారంలో మిగ‌తా వారికి ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటున్నాడు. దీంతో అక్ర‌మాలు ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌కుండా ఇసుక అక్ర‌మ వ్య‌వ‌హారం గుట్టుగా సాగిపోతోంది. ఇదే దందాలో మాజీ స‌ర్పంచ్ కోట్లు గ‌డించాడు.. పెద్ద ఎత్తున లారీలు కొనుగోలు చేశాడు. అవే లారీల‌తో తిరిగి జీరో దందా కొన‌సాగిస్తున్నాడు. అధికారులను మేనేజ్ చేస్తూ వ్య‌వ‌హారం సాగిస్తున్నాడు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక అక్ర‌మ ర‌వాణా సాగుతోంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed