అక్రమంగా గోవుల తరలింపు

by Naresh |
అక్రమంగా గోవుల తరలింపు
X

దిశ, కాగజ్ నగర్: కొమురం భీం జిల్లా కౌటాల మండలంలో ఆదివారం అర్ధరాత్రి గోవులను అక్రమంగా డీసీఎం వ్యాన్‌లో కౌటాల మండలం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ అధ్యక్షుడు శివ గౌడ్, సభ్యులు అడ్డుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి అడ్డుకున్న గోవుల వాహనం వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి బజరంగ్ దళ్ సభ్యుల పై ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో సాయి అనే కార్యకర్తకు తలపై స్వల్ప గాయమైనట్లు బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. పవిత్రంగా భావించే గోవులను అక్రమ రవాణాకు గురికావడం జరుగుతుందని బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గోవులను అక్రమంగా తరలించేందుకు వాహనం ముందు వెనుక కొంతమంది వ్యక్తుల కలిసి సహకరించడంతోనే వాహనాన్ని అడ్డుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తల పై దాడికి దిగినట్లు ఆరోపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న కౌటాల సీ.ఐ సాదిక్ ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణ వాతావరణాన్ని అడ్డుకున్నారు. గొడవకు యత్నించిన వారిని చదరగొట్టడంతో గోవులతో నిండి ఉన్న డీసీఎం వ్యాన్‌తో డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వాహనాన్ని పోలీసులు వెంబడించి సిర్పూర్ రైల్వే గేటు వద్ద నిలిపివేసినట్లు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించేందుకు వచ్చిన బజరంగ్ దళ్ సభ్యుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బజరంగ్ దళ్ సభ్యులు వాహనం ఎదుట డిమాండ్ చేశారు. మూగ జీవాలను పలు పశువుల సంతలో కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు రాత్రి వేళల్లో తరలిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు బిల్లులను చూపిస్తూ మూగజీవాలను కళేబరాలకు తరలిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యంతోనే గోవులను కళ్ళముందే తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఐ చర్యలు తీసుకుంటామని చెప్పడంతో హామీతో ఆందోళన సద్దుమణిగింది. డీసీఎం ద్వారా తరలించే గోవులను రేగుల కూడా గోశాలకు తరలించినట్లు బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story