డెంగ్యూ డేంజర్ బెల్స్.. మన్యంలో 300 దాటిన జ్వర పీడితులు

by srinivas |
డెంగ్యూ డేంజర్ బెల్స్..  మన్యంలో 300 దాటిన జ్వర పీడితులు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆదిలాబాద్ మన్యం జ్వరాలతో మంచం పట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వరపీడితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్న అధికారిక లెక్కలు చూస్తేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 300కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడం జ్వరాల తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉంటున్నది. గతంలో ఆదిలాబాద్ జిల్లా అంటేనే మలేరియా జ్వరాలకు మారుపేరు అన్నట్టుగా ఉండేది అయితే ఇప్పుడు మలేరియా జ్వరాలు అక్కడక్కడ నమోదు అవుతున్నప్పటికీ డెంగ్యూ జ్వరాలు ఉమ్మడి జిల్లాను తీవ్రంగా వణికిస్తున్నాయి. మరోవైపు చికున్ గున్యా జ్వరాలతో బాధితులు కీళ్లనొప్పుల బారినపడి మంచాలకు పరిమితమవుతున్నారు. తాజా పరిస్థితులు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగానికి నిద్రలేకుండా చేస్తున్నాయి.

అధికారిక లెక్కలే ఆందోళనకరంగా...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ఉధృతంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండి అక్కడి జిల్లా కేంద్ర ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి కూడా ప్రతిరోజు జ్వరాలతో వందల మంది రోగులు వస్తున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఒక రిమ్స్ లోనే గత జూన్ నెల నుంచి ఇప్పటిదాకా 87 మందికి డెంగ్యూ పాజిటివ్ తేలింది. ఇక జిల్లాలోని ఉట్నూరు సహా బోథ్, బజార్ హత్నూర్, నేరడిగొండ, తాంసి, తలమడుగు, నరసాపూర్ టీ, భీంపూర్ తదితర అటవీ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరాల కేసులు భారీగా నమోదవుతున్నాయన్న సమాచారం ఉంది. ఇక నిర్మల్ జిల్లాలో అధికారికంగా 56 మంది ఇప్పటికే డెంగ్యూ బారినపడి చికిత్సలు పొందుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో 12 మంది పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వారిగా అధికారులు గుర్తించారు. ఇక అటవీ ప్రాంతం బాగా విస్తరించి ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలోనూ విపరీతంగానే జ్వరాల కేసులు నమోదు అవుతున్నాయి.

ప్రైవేటు దవాఖానాల కిటకిట

ఇదిలా ఉంటే తీవ్రమైన జ్వరాలు తాకిడితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఏ దవాఖానా వెళ్లి చూసినా అన్ని బెడ్లు జ్వర పీడితులతో నిండి ఉంటున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, బైంసా, ఆదిలాబాద్, ఖానాపూర్ మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ తదితర పట్టణాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రులకు వస్తున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయన్న కారణం చూపి ప్రైవేటు వైద్యులు రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరుతున్న రోజులు కనీసం 50 వేల రూపాయల నుంచి లక్షన్నర దాకా ఖర్చు పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

చికున్ గున్యా, టైఫాయిడ్‌తో విలవిల...

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చికున్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు కూడా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ మన్యంలో ఈ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిమ గిరిజనులు టైఫాయిడ్ బారిన పడి ఆసుపత్రిల పాలవుతున్నారు. చికున్ గున్యా కారణంగా తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ రోగులను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిస్తుంది ముఖ్యంగా ఈ జ్వరాలు నిర్మల్ జిల్లాలో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్ 15 దాకా జ్వరాలు తీవ్రత ఉంటుందని అప్పటిదాకా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని పంచాయతీ, మున్సిపల్ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి జ్వరాల తీవ్రతపై సర్వే నిర్వహించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలందాయి.

సీఎస్ ఆదేశంతో కదిలిన కలెక్టర్లు

రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలుపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు ఆసుపత్రులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మూడు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేశారు. జ్వరపీడితుల సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు 24 గంటల సేవలు అందేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తాజాగా సీఎస్ ఆదేశాల మేరకు ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో జ్వరాలపై విజిలెన్స్ మరింత పెంచాల్సిన అవసరాన్ని కలెక్టర్లు గుర్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed