బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి విద్యుత్ షాక్..రోగుల ప్రాణాలతో చెలగాటం

by Aamani |
బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి విద్యుత్ షాక్..రోగుల ప్రాణాలతో చెలగాటం
X

దిశ,బెల్లంపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల విస్తారంగా కురిసిన వర్షాలకు బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ తడిసి ముద్దయింది. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్లు తడిసిన గోడల వల్ల ఎర్తింగ్ ప్రమాదం నుంచి తృటిలో తప్పిన సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. ముందుచూపు లేనితనం, వైద్యాధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం రోగుల ప్రాణాలకు చెలగాటంగా మారింది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లోనీ అత్యవసర విభాగం (క్యాజువాలిటీ) వర్షానికి గోడలు తడిసి పోయాయి. మహిళా విభాగంలో అడ్మిట్ అయిన పేషంట్లకు ఎర్తింగ్ వచ్చింది.

ఈ షాక్ వల్ల రోగులు ఒకసారి ఆందోళన గురయ్యారు. ఎర్తింగు సమాచారాన్ని వైద్య సిబ్బంది ఆస్పత్రి నిర్వహణ అధికారికి చేరవేశారు. దీంతో హడావుడిగా క్యాజువాలిటీలోని మహిళా విభాగంలోని పేషెంట్లను మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. అత్యవసర విభాగంలో తలెత్తిన విద్యుత్ ఎర్తింగ్ షాక్ కలకలం రేపింది. క్యాజువాలిటీ మహిళ విభాగం గోడలకు ఎర్తింగ్ షాక్ నుంచి ప్రాణాలతో బయటపడిన రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం పేషెంట్ల తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కూడా పెను గండమైంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి గోడలు తడిసినప్పుడు ఎర్తింగ్ షాక్ సంభవిస్తుందన్న స్పృహ వైద్యాధికారుల్లో లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అస్తవ్యస్తంగా విద్యుత్ వైరింగ్ వ్యవస్థ..?

బెల్లంపల్లి హాస్పిటల్ అత్యవసర విభాగం లో విద్యుత్ సరఫరా వైరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగానే క్యాజువాలిటీలో ఎర్తింగ్ సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం రోగుల ప్రాణాలకు మప్పుగా మారింది. విద్యుత్ వైరింగ్ అస్తవ్యస్తం తో పాటు ఆసుపత్రి గోడలు పగుళ్లతో వర్షం నీరు లీకేజీతో తేమ పట్టాయి. తడిసి తేమ పట్టిన గోడలకు ఎర్తింగ్ షాక్ సంభవిస్తుందని అధికారులు ముందే గ్రహించాలి. ఈ దిశగా పర్యవేక్షణ దృష్టి లేకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి క్యాజువాలిటీ పూర్తిగా తడిసి ముద్దయింది.

అధికారుల ఏమరుపాటు, విద్యుత్ విభాగం ఉద్యోగి నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సింగరేణి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభించడం అటుంచితే,రోగుల పరిరక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారిందoటే అతిశయోక్తి కాదు. ఆసుపత్రిలో ఆధ్యంతం మొక్కుబడి విధులతో కాలంవెళ్ళదీస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా యజమాన్యం ఆస్పత్రి భవనం లో విద్యుత్ అస్తవ్యస్తతను చక్కదిద్దాలి. పటిష్టమైన ఎర్తింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఆసుపత్రి పర్యవేక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వైధ్యాఅధికారిపైచర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed