ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైన బోథ్ రాజకీయం

by Mahesh |
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైన బోథ్ రాజకీయం
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలో నెలకొన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. కొంతకాలంగా అక్కడి శాసనసభ్యుడు రాథోడ్ బాపురావును నియోజకవర్గ వ్యాప్తంగా కొందరు నేతలు ఏకమై వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కనివ్వకుండా పావులు కదుపుతున్నారు.

అయితే అధిష్టానం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించగా ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెండు వర్గాలు వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాయి. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలి ఘటనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు పార్టీని నిట్టనిలువుగా చీల్చగా భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందోనన్న అభిప్రాయాలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.

మూడేళ్లుగా ఆదిపత్య పోరాటం...

రాథోడ్ బాపురావు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. మూడేళ్లుగా విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు జి నగేష్ గతంలో ఈ నియోజకవర్గంలో నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. నేరేడిగొండ జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఆర్థికంగా బలంగా ఉన్న బోథ్ మండల పరిషత్ అధ్యక్షుడు తుల శ్రీనివాస్ ఎమ్మెల్యే బాపురావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తుల శ్రీనివాస్ సెంటర్ పాయింట్ గా మారారు. ఆయన చెప్పే రాజకీయాలు నడుస్తున్నాయి.

ఆత్మీయ సమ్మేళనాలతో తెరపైకి విభేదాలు..

కొన్నేళ్లుగా వర్గ విభేదాలు ఉన్నప్పటికీ ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఈ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం బోత్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ఆత్మీయ పార్టీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఎమ్మెల్యే బాబురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు ఆయన బోత్ పట్టణంలోని సాయి గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. అయితే మండల పరిషత్ అధ్యక్షుడు తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాబురావు కు వ్యతిరేకంగా స్థానికంగానే ఉన్న పరిచయ గార్డెన్స్ లో మరో సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ జీ నగేష్ హాజరయ్యారు కానీ ఎమ్మెల్యే బాబురావు నిర్వహించిన సమ్మేళనానికి ఆయన వెళ్ళలేదు. ఈ వ్యవహారం నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం..

తాజాగా బోథ్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న వర్గ విభేదాలు అధికార భారత రాష్ట్ర సమితి పార్టీపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు బలంగానే ఉన్నాయి. అధికార పార్టీ ఆశించిన స్థాయిలో బలోపేతంగా లేదని అధిష్టానం కు సైతం సమాచారం ఉంది. గతంలో మంత్రి కేటీఆర్ సమక్షంలోనూ ఇరువర్గాల నడుమ వివాదాలు జరిగాయి. పరిష్కార మార్గం కోసం పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ రాజీ కుదరలేదు తాజా పరిణామాలు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని సొంత పార్టీలోనే చర్చ మొదలైంది.

అధిష్టానానికి వీజీ గౌడ్ నివేదిక..

బోథ్ నియోజకవర్గం లో తెరకెక్కిన వర్గ రాజకీయాలను పార్టీ జిల్లా ఇన్చార్జి వి గంగాధర్ గౌడ్ అధిష్టానానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఆయన ఎమ్మెల్యే బాబురావు నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తాజా పరిణామాలపై ఆయన పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం పార్టీలో కొందరు నేతల పై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Next Story