- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధులు లేక నిర్వహణ భారం..!
దిశ, లక్షెట్టిపేట : గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల లేక పోవడంతో నిర్వహణ భారంగా మారింది. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలకు, ఇతర అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా విడుదల కావాల్సిన నిధులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. జేబుల్లో నుంచి, వడ్డీలకు డబ్బులు తెచ్చి నిర్వహణ పనులు నెట్టుకొస్తుండటం వారికి భారంగా మారుతోంది. నిధుల విడుదల ఇంకా జాప్యమైతే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
జీరో అకౌంట్లు తెరిచినా...
ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వ నిధులైన 15వ ఆర్థిక సంఘం నిధులు, మూడు నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల కావడంలేదు. మంచిర్యాల జిల్లాలో 311 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.94కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధులు రూ. 5.80 కోట్లు విడుదలయ్యేవి. జనాభా ప్రాతిపదికను బట్టి ఆయా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేవి. కాగా, కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుండేది.
అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తున్నదని భావించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ నిధులను జమచేసేందుకు జీరో అకౌంట్లను ఏప్రిల్ లో తెరిపించింది. ఈ నిర్ణయంతో సర్పంచుల్లో హర్షం వ్యక్తమైనా అది ఎంతో కాలం నిలవలేదు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా జమకాలేదు. అకౌంట్ తెరిచి ఆరు నెలలైనా ఆ నిధుల జాడలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఆగస్టు నుంచి నిలిచిపోయాయి.
సర్పంచ్ లపైన ఆర్థిక భారం..
గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రతినెలా విడుదల చేసే నిధులతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ ఇంధనం, ట్రాక్టర్ ఇఎంఐ చెల్లింపులు, విద్యుత్ బిల్లు చెల్లింపు, ప్రత్యేక పారిశుధ్య, హరితహారం కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక కార్యక్రమాల్లో అదనపు కార్మికుల ఏర్పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ నిధులు విడుదల కాకపోతుండటంతో సర్పంచులపై ఆర్థికభారం పడుతోంది. పంచాయతీలకు ఆస్తి పన్నురూపేనా వస్తున్న కొద్ది పాటి ఆదాయం గ్రామపంచాయతీ నిర్వహణకు ఏ మూలనా సరిపోవడం లేదు.
గత జులై 25 నుంచి ఆగస్టు రెండు వరకు గ్రామపంచాయతీల్లో నిర్వహించిన పల్లెప్రకృతి కార్యక్రమం నిర్వహణ పనుల ఖర్చుల భారం సర్పంచ్ పైన పడింది. నిధుల విడుదల ఇలాగే నిలిచిపోతే చేతులెత్తాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు సర్పంచులు వాపోతున్నారు. దీంతో గ్రామపంచాయతీల్లో పాలన పడకేసి గ్రామాల అభివృద్ధి కుంటుపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి గ్రామాల అభివృద్ధి కుంటు పడకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.