తిర్యానీ టు హైదరాబాద్.. పాదయాత్ర చేపట్టిన ఆదివాసి నేత ధర్ము

by Nagam Mallesh |
తిర్యానీ టు హైదరాబాద్.. పాదయాత్ర చేపట్టిన ఆదివాసి నేత ధర్ము
X

దిశ, తాండూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం గాంధీ వేషధారణతో ఆదివాసి నేత పెందూరు ధర్ము పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రంలో 78వ పంద్రాగస్టు వేడుకలు అనంతరం కుమురం భీం విగ్రహానికి ధర్ము పూలమాలలు వేసి, గాంధీ వేషధారణతో జాతీయ జెండా పట్టుకుని రాంమందిర్ నుండి హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తిర్యాని మండలంలోని సమస్యలను ఆసిఫాబాద్ కలెక్టర్ కు విన్నవించిన పరిష్కారానికి నోచుకోలేదన్నారు. తిర్యాని మండల కేంద్రం నుండి మాదారం త్రీ ఇంక్లైన్ వరకు ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించాలని, మండలంలోని పలు గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ఎన్టీఆర్ సాగర్, చలిమెల వాగు ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువలను పునరుద్ధరించి రైతులకు వ్యవసాయానికి రెండు పంటలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మండలంలోని ప్రధాన సమస్యలను దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Next Story