నిందితులే ఇన్ఫార్మర్లుగా.. డ్రగ్స్‌ దందా అరికట్టేందుకు ఏఎన్‌బీ స్కెచ్

by Shiva |
నిందితులే ఇన్ఫార్మర్లుగా.. డ్రగ్స్‌ దందా అరికట్టేందుకు ఏఎన్‌బీ స్కెచ్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్న నానుడి ఆధారంగా డ్రగ్స్ దందాను అరికట్టేందుకు యాంటీ నార్కొటిక్ బ్యూరో స్కెచ్ వేస్తోంది. గంజాయి, ఎక్టసీ, ఆల్ఫాజోలెం డ్రగ్స్‌పై ఏఎన్‌బీ అధికారులు దృష్టి సారించారు. దందా చేస్తున్న వారిని పట్టుకునేందుకు గతంలో పట్టుబడిన నిందితుల్లో కొందరిని ఇన్ఫార్మర్లుగా మార్చుకునే పనిలో పడ్డారు. వారి ద్వారా ప్రధాన సప్లయర్లు, డ్రగ్ పెడ్లర్ల ఆటకట్టించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు.

నిందితులే ఇన్ఫార్మర్లుగా...

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్‌రెడ్డి విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన వనరులను సమకూరుస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులతో పాటు యాంటీ నార్కొటిక్​ బ్యూరో అధికారులు డ్రగ్స్​మహమ్మారిని అరికట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం పాత కేసుల్లో అరెస్ట్ అయినా నిందితుల్లో కొందరిని ఇన్ఫార్మర్లుగా మార్చుకునే పనిలో పడ్డారు.

ప్రధానంగా వాటాపైనే దృష్టి

రాష్ట్రంలో గంజాయి, ఆల్ఫాజోలెం, ఎక్టసీ పిల్స్ సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. 2023 డిసెంబర్ ​నెలాఖరు నాటికి రాష్ర్ట వ్యాప్తంగా డ్రగ్స్‌కు సంబంధించి 1,360 కేసులు నమోదు కాగా, వాటిలో 1,273 కేసులు గంజాయికి సంబంధించినవే ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో ఆల్ఫాజోలెం, ఎక్టసీ పిల్స్ కేసులు నిలిచాయి. ఇక, 2023 ఏప్రిల్ ​3‌‌0న ప్రారంభమైన యాంటీ నార్కొటిక్ బ్యూరో డిసెంబర్ ​నెలాఖరు నాటికి 59 కేసులు నమోదు చేసి 182 మందిని అరెస్టు చేసింది. వీరిలో గంజాయి పెడ్లర్ల సంఖ్య 150కి పైగానే ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి.

ఆంధ్రా నుంచే ఎక్కువగా..

మన రాష్ర్టానికి అక్రమంగా దిగుమతి అవుతున్న గంజాయిలో 90 శాతం ఆంధ్రప్రదేశ్ ​నుంచే వస్తుండటం గమనార్హం. ప్రధానంగా అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్న గంజాయి హైదరాబాద్‌తో పాటు నగరం మీదుగా మహారాష్ర్ట, కర్ణాటకకు చేరుతోంది. ఆంధ్రప్రదేశ్ తరువాత ఒడిశా నుంచి ఎక్కువగా గంజాయి ఇక్కడకు చేరుతోంది. 2023లో రాష్ర్టం మొత్తం మీద రూ.7.99 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గంజాయి వాటానే రూ.4.13 కోట్లుగా ఉంది. ఆ తరువాత రూ.1.31 కోట్ల విలువైన ఆల్ఫాజోలెం, రూ.92.50 లక్షల విలువైన ఎక్టసీ పిల్స్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీటి దందాను అరికట్టడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పాత కేసుల్లోని నిందితుల్లో కొందరిని ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. వీరి ద్వారా ఆంధ్రా ప్రాంతంలో ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతోంది.

ప్రధాన సప్లయర్లు ఎవరు, ఏయే పద్ధతుల్లో స్మగుల్ చేస్తున్నారు? అన్న వివరాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. ఆల్ఫాజోలెం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రధాన సప్లయర్లు ఎవరన్న దానిని అధికారులు గుర్తించారు. వీరిలో కొందరిని అరెస్టు కూడా చేశారు. పరారీలో ఉన్న మిగితా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక, కొకైన్, హెరాయిన్, బ్రౌన్​షుగర్, ఎండీఎంఏ, ఎక్టసీ పిల్స్ ​ప్రధానంగా గోవా నుంచి ఇక్కడకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ పట్టుబడ్డ వారి నుంచి ప్రధాన సప్లయర్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నైజీరియాకు చెందిన అమోబీ చుక్వాడీ, మైఖేల్, థామస్‌ను అరెస్టు కూడా చేశారు. వీరి నుంచి ఆఫ్రికన్ ​దేశాలకు చెందిన స్మగ్లర్ల సమాచారాన్ని ఇప్పటికే సేకరించిన అధికారులు వారి కోసం వేటను ప్రారంభించారు.

పక్క రాష్ట్రాల సమన్వయంతో..

డ్రగ్స్ దందాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ర్ట పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇన్ఫార్మర్ల ద్వారా సేకరించే సమాచారాన్ని పక్క రాష్ర్టాల పోలీసులతో పంచుకోనున్నారు. తద్వారా ప్రధాన సప్లయర్ల ఆట కట్టించాలని భావిస్తున్నారు. డ్రగ్స్‌ను అరికట్టే విషయంలో ప్రజల సహకారమూ తీసుకోవాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం తెలిసినా.. అనుమానం వచ్చినా వెంటనే 87126-11111 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతో పాటు [email protected] వెబ్‌సైట్‌కు సమాచారం పంపాలని తెలియజేశారు. సమాచారం ఇచ్చిన వారికి రివార్డులు కూడా ఇస్తామన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed