సంగం బండ కాలువలో అడ్డుగా పెద్ద రాయి.. ఏడువేల ఎకరాలకు సాగునీరేది ?

by Seetharam |   ( Updated:2023-06-07 14:51:27.0  )
సంగం బండ కాలువలో అడ్డుగా పెద్ద రాయి.. ఏడువేల ఎకరాలకు సాగునీరేది ?
X

దిశ మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సంగం బండ ప్రాజెక్టు పూర్తయి ఏడు సంవత్సరాలైనా ప్రాజెక్టు కింద ఉన్న 7వేల ఎకరాలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెరాస ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కాలవలో ఉన్న బండరాయిని తొలగించడంలో శ్రద్ధ చూపకపోవడంతో పదకొండు గ్రామాల్లో వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనా..బుధవారం సాగునీటి విజయోత్సవాలు జరుపు కోవడం ఎంతవరకు సమంజసమని రైతులు పాలక ప్రభుత్వాన్ని వేలేత్తి చూపుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీమా లిఫ్టిరిగేషన్ లో భాగంగా సంగంబండ ఫేస్ వన్ రిజర్వాయర్ ద్వార దాదాపు లక్ష ఎకరాలను సాగులోకి తెస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తయి ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో.. మూడున్నర టీఎంసీల నీటిని నీటి నిల్వ కెపాసిటీతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 80శాతం పనులు పూర్తి చేసింది. తెరాస ప్రభుత్వం వచ్చాక సంగం బండ రిజర్వాయర్‌కి షటర్లను బిగించి తమ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటుంది. సంగంబండ కుడి లో లెవెల్ కెనాల్ లో అడ్డుగా ఉన్న 700 మీటర్ల పొడవు ఉన్న బండరాయి తొలగించడంలో పాలక ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. దీనికి నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా విఫలమైంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంగం బండ రిజర్వాయర్ చేపట్టి మూడున్నర టీఎంసీల నీటి నిల్వతో.. మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్‌లలో వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. వీటితోపాటు 70 చెరువులను నింపడంతో అదనంగా భూమి సాగు బడిలోకి వచ్చింది. చెరువులన్ని నీటితో కళకళ లాడ డంతో భూగర్భ జలాలు పెరిగాయి. కానీ మక్తల్ మండలం లోని సంగం బండ రిజర్వాయర్ కుడి లో లెవెల్ కెనాల్లో 700 మీటర్ల పొడవైన బండరాయి అడ్డంగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తాయి. మక్తల్ మండలంలో గుర్లపల్లి, వనాయకుంట, దాసరిపల్లి, వనాయకుంట, తిర్లాపురం, చందాపూర్క, మాగనూరు మండలంలోని పెగడబండ, వడ్వాట్, సత్యవార్ పరమన్ దొడ్డి, ఓబులాపూర్ గ్రామాలలోని దాదాపు 7వేల ఎకరాలకు సాగునీరు అందటంలేదు. సాగునీరు ఎప్పుడందుతుందోనని ఆ ప్రాంత రైతులు ఎదురు చూస్తున్నారు. బండరాయిని తొలగించేందుకుగాను నిదులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నుండి దిగివస్తాయి మంత్రుల వరకు ఎమ్మెల్యే ద్వారా రైతులు వినతి పత్రాలు ఇచ్చారు. ధర్నాలు చేసిన నేటికీ పాలక ప్రభుత్వంలో కనికరం కనిపించలేదు. లో లెవెల్ కెనాల్లో అడ్డంగా ఉన్న బండను తొలగించ కుండా సాగునీటి విజయోత్సవాలుఎలా జరుపుకుంటారని ఆ గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ బండ తొలగింపు, సంగంబండ నిర్వాసిత ప్రజలకు చెల్లించాల్సిన నష్ట పరిహారము ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఎకరం కోట్ల రూపాయల్లో ధరలు పలుకుతున్నందున తమకు నష్టపరిహారం చెల్లించకుండా లో లెవెల్ కెనాల్ లో ఉన్న బండను తొలగించేందుకు వీలులేదని పలుమార్లు ఆ గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఈ విషయంపై ఆ ప్రాంత రైతులు పలుమార్లు జిల్లా కలెక్టర్లకు, ప్రభుత్వాలకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివేదికలు పంపించారు.

రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినందు వల్ల పూర్తి చేయడంతో తమకు ఒరిగేది లేదని ఆయన చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంఘం మండల్ లెవెల్ కెనాల్ లో రాయిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాయి తొలగింపు చేసి సాగునీరందించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి వెనకాడమని, తమతో పాటు సంగం బండ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామంలోని ప్రజలను చైతన్యం చేస్తామని ఆ గ్రామరైతులు అంటున్నారు.

Advertisement

Next Story