రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. తెలంగాణలో 238 ఓట్లు

by GSrikanth |
రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. తెలంగాణలో 238 ఓట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అధ్యక్ష ఎన్నికలకుగాను గాంధీ భవన్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటంది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకు రెండు చొప్పున మొత్తం 238 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. రిటర్నింగ్ అధికారిగా పార్లమెంటు సభ్యులు రాజ్‌మోహన్ ఉన్నతన్ వ్యవహరిస్తుండగా అసిస్టెంట్ ఆర్వోగా రాజ్ భగేల్ నియమితులయ్యారు. రాష్ట్రం మొత్తానికి గాంధీ భవన్ ఒక్కటే పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నది.

మల్లికార్జున్ ఖర్గే తరఫున పోలింగ్ ఏజెంట్లుగా షబ్బీర్ ఆలీ, మల్లు రవి నియమితులయ్యారు. శశిథరూర్ తరఫున ప్రొఫెషనల్ కాంగ్రెస్ విభాగానికి చెందిన కుమ్మరి శ్రీకాంత్, సంతోష్ కుమార్ రుద్ర నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీచేస్తున్న ఖర్గే, శశిథరూర్ ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి మద్దతు ప్రయత్నాలు చేశారు. శశిథరూర్‌కు తెలంగాణ నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. మల్లికార్జున్ ఖర్గే విజిట్‌కు మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భారీగానే హాజరై ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం మునుగోడు పర్యటనలో సీనియర్ నేతలు బిజీగా ఉన్నందున సోమవారం ఉదయం గాంధీభవన్‌లో జరిగే పోలింగ్‌కు ఎంత మంది గైర్హాజరవుతారనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed