ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్.. ఈటల ప్రచారానికి జనం ఫిదా..!

by Prasad Jukanti |   ( Updated:2024-04-04 09:31:36.0  )
ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్.. ఈటల ప్రచారానికి జనం ఫిదా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తున్నాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచార పద్ధతులైన సభలు, సమావేశాలు, కళాజాతలతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తూ ప్రత్యర్థుల కంటే ధీటుగా ప్రజల్లోకి దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న పద్ధతులపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తాజాగా ‘ఫ్లాష్ మాబ్’తో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సమస్యలు, కేంద్ర పథకాలపై ప్రచారం

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మల్గాజిగిరి నియోజకవర్గం ఉప్పల్ డివిజన్‌లోని పిస్తా హౌస్ సెంటర్‌లో జి మైల్ గ్రూప్ నేతృత్వంలో 26-క్రియేటర్స్ కళాకారుల బృందం ఫ్లాష్ మాబ్ ద్వారా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ‘కదిలె చూడు.. కదిలె చూడు.. కదన సింహం.. కాషాయపు జెండా పట్టి..’ అనే పాటకు చిందులు తొక్కుతూ జనాన్ని ఉర్రూతలూగించారు. ఈటలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై.. నినాదాలతో హోరెత్తించారు. దాదాపు గంటపాటు ఈ ప్రదర్శన సాగగా ఈ తరహా ఎన్నికల ప్రచారం సరికొత్తగా ఉందని పలువురు ప్రశంసించారు.

ఓ వైపు ర్యాంప్ వాక్‌.. మరో వైపు ఫ్లాష్ మాబ్‌

ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో ర్యాంప్ వాక్ రాజకీయాలు రఫ్పాడిస్తున్నాయి. పార్టీలు నిర్వహిస్తున్న సభలో ముఖ్య నాయకులు తమ స్పీచ్ ముగిసిన తర్వాత లేదా అంతకు ముందు కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వారి దగ్గరకు చేరువ అయ్యేలా ర్యాంప్‌పై నడుచుకుంటూ వెళ్తారు. సభకు వెళ్లిన వారు తమ నేతను దగ్గర నుంచి చూశామనే ఫీల్ కలిగేలా పార్టీలు ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఏపీలో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ర్యాంప్ వాక్ చేయగా తెలంగాణలో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ర్యాంప్ వాక్ వేదిక ద్వారా ప్రజలకు అభివాదం చేశారు. ఇక ఇటీవల కరీంనగర్‌లో కేసీఆర్ నిర్వహించిన కదనభేరీ సభలోనూ ర్యాంప్ వాక్ వేదిక ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ వాక్ రాజకీయాలు తమిళనాడులో స్టాలిన్ నుంచి పాపులర్ కాగా ఆపై పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి లీడర్లు ఇదే ఫాలో అయ్యారు. ఈ ట్రెండ్ కొనసాగిస్తూనే మరోవైపు పార్టీలు ఫ్లాష్ మాబ్ ప్రచారాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఈ తరహా ప్రచారం గత ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు విస్తృతంగా నిర్వహించగా తాజాగా ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో ఈటల రాజేందర్ తమ ప్రచారంలో వినియోగించడం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story