ROR Act 2024 Draft: కొత్త ఆర్వోఆర్ చట్టం అవసరమే

by Praveen Kumar Siramdas |   ( Updated:2024-08-26 14:37:52.0  )
ROR Act 2024 Draft: కొత్త ఆర్వోఆర్ చట్టం అవసరమే
X

ధరణితో ఎగలేం!

కొత్త ఆర్వోఆర్ చట్టం అవసరమే

సామాన్యుడికి సత్వర న్యాయం కావాలి

కింది స్థాయిలోనే పరిష్కారం ఉండాలి

ముసాయిదాపై సర్వత్రా ఏకాభిప్రాయం

భూదార్ అంశంపై అమితాసక్తి

ముగిసిన 21 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ

దిశ, తెలంగాణ బ్యూరో:

రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్, అది సృష్టించిన సమస్యలతో ఎగలేకపోతున్నామంటున్నారు. అధికారుల తప్పిదాలకు తాము బలవుతున్నాం. అప్లై చేసి ఏండ్లు గడుస్తున్నా పరిష్కరించడం లేదు. కొన్ని సమస్యల పరిష్కారానికి తమకూ అధికారమే లేదని కలెక్టర్లు అంటున్నారు. రెండు గుంటల మిస్సింగ్ కి కూడా సీసీఎల్ఏకు మొర పెట్టుకునే వ్యవస్థ అక్కెరలేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా రూపొందించిన ఆర్వోఆర్ యాక్ట్ 2024 ముసాయిదాపై 21 రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, రైతులు, న్యాయవాదులు ముసాయిదాపై చర్చించారు. ఐతే కొత్త చట్టం అవసరమేనని 100 శాతం అభిప్రాయపడ్డారు. ధరణి పోర్టల్ వైఫల్యాలతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాలను ఏకరవు పెట్టారు. ఏ ఒక్కరి నుంచి కూడా కొత్త చట్టం ఎందుకని? సవరణలు చేస్తే సరిపోతుంది? కదా అన్న అభిప్రాయం వినిపించలేదు. ధరణి స్థానంలో సామాన్యులకు సత్వర, మెరుగైన సేవలందించే ఏ వ్యవస్థ వచ్చినా ఫర్వాలేదన్న ఏకాభిప్రాయం వినిపించింది. ఐతే చట్టంపైన అవగాహన కల్పించని కారణంగా కొన్ని సందేహాలను, సూచనలను లేవనెత్తారు. వనపర్తి, గద్వాల జిల్లాల సదస్సులను ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ తో కలిసి ‘దిశ’ ప్రతినిధి పరిశీలించారు. ఇక్కడ లేవనెత్తిన అంశాల ప్రాతిపదిక ఇలా ఉంది.

ఐఏఎస్ కి భిన్నంగా..

ఆర్వోఆర్ 2020 కి కొన్ని సవరణలు చాలునని, కొత్త చట్టం అవసరం లేదని వాదించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అభిప్రాయం పట్ల ఎక్కడా మద్దతు లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి పడుతున్న సమయం, రిజెక్ట్ కు గురవుతున్న కారణాలతో జనం విసిగివేసారారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటితో భేటీలో సవరణలతో నెట్టుకురావాలన్న ఆయన సూచనకు ఎక్కడా మద్దతు లభించకపోవడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో కేసీఆర్ సృష్టించిన ధరణి పోర్టల్ తో ఎంత నరకం అనుభవించారన్నది పరిశీలించిన ఎవరైనా కొత్త విధానం, కొత్త చట్టం అనివార్యతను గుర్తిస్తారని రెండు రోజుల సదస్సుల్లో స్పష్టమైంది. వర్తమానం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ముసాయిదా పట్ల జనామోదం లభించింది.

సదస్సుల్లో భిన్నాభిప్రాయాలు

1. 21 రోజుల పాటు సీసీఎల్ఏ ఆఫీసుకు, రెండు రోజుల జిల్లా స్థాయి సదస్సుల్లో ఆర్వోఆర్ 2024 డ్రాఫ్ట్ కి ఆమోదం లభించింది. దాంతో పాటు కొన్ని ప్రధానాంశాలపై సూచనలు, భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వీటికి చట్టాన్ని రూపొందించిన భూమి సునీల్ ఇచ్చిన క్లారిటీ ఇలా ఉంది.

2. మ్యుటేషన్: మ్యుటేషన్ ని ఎవరైనా ఆపే అధికారం తహశీల్దార్లకు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ముసాయిదాలో ప్రధానాంశం. ఐతే హక్కులు లేకపోయినా సేల్ డీడ్ చేసినప్పుడు, భూమి లేకుండానే అమ్మినప్పుడు.. అవి తహశీల్దార్ దృష్టికి వచ్చినా, ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఆపే అధికారం ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. అది కూడా నిర్దిష్ట కాలం వరకు ఆపే అధికారం ఉంటుంది. ఆ తర్వాత ఆటోమెటిక్ గా మ్యుటేషన్ అయిపోతుంది.

3. అప్పీల్: అదనపు కలెక్టర్/కలెక్టర్ నుంచి అప్పీల్ వ్యవస్థను మొదలుపెట్టాలా? ఆర్డీవో నుంచే మొదలు పెట్టాలా? సీసీఎల్ఏ దాకా ఉంచాలా? కలెక్టర్ వరకే పరిమితం చేయాలా? అన్న దానిపై చర్చ జరిగింది. ఐతే ఆర్డీవో నుంచే మొదలు పెడితే కొన్ని రకాల మ్యుటేషన్ల అధికారాలను కూడా తహశీల్దార్లకే అప్పగించాల్సి వస్తుంది.

4. రెవెన్యూ కోర్టులా? ట్రిబ్యునలా?: దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశ వ్యాప్తంగా రికార్డుల సవరణ కోసం ఎక్కడా ట్రిబ్యునల్ లేదు. వన్ టైం సెటిల్మెంట్ కోసం పెట్టడం అవసరమా? లేదా? అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. అందులోనూ ట్రిబ్యునల్ పెడితే రిటైర్డ్ జడ్జితోనా? రిటైర్డ్ రెవెన్యూ అధికారులతోనా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ట్రిబ్యునల్ ఏర్పాటైతే సామాన్యుడు ఒక్కడే జడ్జి దగ్గరికి వెళ్లి తన ఆవేదనను చెప్పుకోగలడా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

5. పీనల్ ప్రొవిజన్స్ : తప్పు చేసిన ఏ అధికారికైనా శిక్ష పడేటట్లు చట్టంలో సెక్షన్ ఉండాలంటున్నారు. ధరణి బాధితుల నుంచి ఈ డిమాండ్ బాగా ఉంది. ఇంత అన్యాయంగా, అక్రమంగా తమను ఇబ్బందులకు గురి చేశారన్న ఆవేదన కనిపించింది. వాళ్లు తప్పు చేసి తమను ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆగ్రహం సదస్సుల్లో వ్యక్తమైంది. న్యాయవాదులు కూడా వారిపై పీనల్ ప్రొవిజన్స్ ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. ఐతే అధికారులు మాత్రం క్రిమినల్ ప్రొవిజన్స్ ద్వారా కోర్టులు శిక్షిస్తున్నాయంటున్నారు. పైగా ఒక అధికారి దగ్గర న్యాయం దక్కకపోతే అప్పీల్ వ్యవస్థ కూడా ఉంది కదా అంటున్నారు.

6. సాదాబైనామా: ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? ఏ అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు? అమ్మిన వ్యక్తి ఇప్పుడు ఒప్పుకోకపోతే తిరస్కరిస్తారా?

7. సర్వే మ్యాప్: ప్రతి సేల్ డీడ్ లోనూ సర్వే మ్యాప్ అంటే సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కొరత తీవ్రంగా ఉంది కదా అన్న ప్రశ్న తలెత్తింది. దీనికి 1500 మందికి పైగా లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారని, వారందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం ద్వారా సాధ్యమేనని భూమి సునీల్ అభిప్రాయం.

8. రీ సర్వే: రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వే చేసిన తర్వాతే కొత్త చట్టం తీసుకురావాలని కొందరు రిటైర్డ్ అధికారులు, అడ్వకేట్లు సూచించారు. ఐతే చట్టంలో భూదార్ పర్మినెంట్ నంబరు ఇచ్చేటప్పుడు సమగ్ర సర్వే అనివార్యమని పేర్కొన్నారు.

9. ఫీజు తగ్గించాలి: ధరణికి ముందు సక్సెషన్ ఉచితంగా చేసే వ్యవస్థ ఉంది. తండ్రి నుంచి వారసులకు భూమి రాసేందుకు కూడా ఎకరానికి రూ.2500 వసూలు చేయడం, ప్రతి దరఖాస్తుకు రూ.1000కి పైగా విధించడం అన్యాయమన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది. ఈ ఫీజును రద్దు చేయాలన్న డిమాండ్ వినిపించింది.

10. కాస్తు కాలమ్: ఇది పునరుద్దరించాలని ప్రజా సంఘాల డిమాండ్. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం.

చాలా వరకు రూల్స్ వచ్చేవే: ఎం.సునీల్ కుమార్, ధరణి కమిటీ సభ్యుడు

ఆర్వోఆర్ 2024 డ్రాఫ్ట్ పై ప్రజల్లో పెద్ద చర్చ జరిగింది. 13 ఏండ్ల తర్వాత ఓ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమంటే ప్రజాస్వామ్య పాలనకు అద్దం పడుతుంది. ఏ చట్టమైనా ఇలాగే రావాలి. ఇప్పటి వరకు కొత్త చట్టం అవసరం ఏమిటని, అవసరం లేదని, పాత చట్టాన్ని కొనసాగించాలన్న అభిప్రాయం రాలేదు. అంటే ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది ఇబ్బంది పడడమే కారణం. అలాగే కొన్ని సూచనలు కూడా వచ్చాయి. వాటిలో చాలా వరకు రూల్స్ ఫ్రేం చేయడం ద్వారా సాధ్యమయ్యేవే ఉన్నాయి. కొన్నేమో ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. సక్సెషన్, దరఖాస్తు ఫీజుని తగ్గించాలని మేం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. కాస్తు కాలమ్ పై పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed