Breaking : మేడారం సమ్మక్క సారక్క జాతరలో అపశృతి..

by Indraja |   ( Updated:2024-01-31 15:03:15.0  )
Breaking : మేడారం సమ్మక్క సారక్క జాతరలో అపశృతి..
X

దిశా డైనమిక్ బ్యూరో: మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ లోని అన్ని మూలల నుండి భక్తులు తరలి వస్తారు. జాతర సమయంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అయితే జాతరలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అశ్వరావుపేట మండలం పాకాలగూడెం నివాసి తోట నాగముత్యం దమ్మాపేట పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా అధికారులు నాగముత్యంకు మేడారం జాతర భాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో నాగముత్యం మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే జాతర చూడడానికి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆవ్యక్తి పరిస్థితి చూసి కుటుంబసభ్యులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో ఆ వ్యక్తి చుట్టూ జనం గుమ్మిగూడి చూస్తూ ఉండిపోయారు.

అంతలో విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ నాగముత్యం ఆ ప్రదేశానికి వెళ్లి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తికి సీపీఆర్ చేసాడు. దీనితో ఆ వ్యక్తి స్పృహ లోకి వచ్చి కళ్లు తెరిచాడు. అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న వ్యక్తి మళ్లీ సాధారణ స్థితికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అతన్ని దగ్గర లోని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ నాగముత్యం సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడి సమ్మక్క సారక్క జాతరలో ఎలాంటి అపశృతి కలగకుండా చేసినందుకు ఆయన పై భక్తులు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.

Advertisement

Next Story

Most Viewed