ROR Act 2024: ఆర్వోఆర్ తోనే 80 శాతం పరిష్కారం

by Praveen Kumar Siramdas |
ROR Act 2024: ఆర్వోఆర్ తోనే 80 శాతం పరిష్కారం
X
  • ఆర్వోఆర్ తోనే 80 శాతం పరిష్కారం
  • మిగతా అన్ని భూమి చట్టాలతో 20 శాతమే
  • పేదలకు చట్టం చుట్టం కావాలి
  • పారాలీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలి
  • ముసాయిదాపై చర్చలో భూమి సునీల్, లచ్చిరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో:

భూమి చట్టాలు అనేకం. అందులో ఆర్వోఆర్ చట్టమే కీలకం. దాంతోనే 80 శాతం సమస్యలు ముడిపడి ఉంటాయని భూ చట్టాల నిపుణులు, ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. మిగతా అన్ని రెవెన్యూ చట్టాల పరిధిలో కేవలం 20 శాతమే ఉంటాయన్నారు. భూమి ఉండాలి, కాగితం ఉండాలి.. అప్పుడే హక్కులు సొంతమవుతాయన్నారు. ఏ చట్టమైనా పేదలకు చుట్టంగా మారినప్పుడే న్యాయం దక్కుతుందన్నారు. బుధవారం పారా లీగల్స్ అండ్ కమ్యూనిటీ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్వోఆర్ ముసాయిదా చట్టం 2024 పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాల మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఇది ప్రజల్లోకి ఎంతగా వెళ్తే అంతగా అమలు ఈజీ అవుతుందన్నారు. పేదలకు రెవెన్యూ సేవలను ఉచితంగా అందించే వ్యవస్థ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్​లో అమలు చేస్తున్నారని, వాటి ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు 2014 నుంచి ఆ వ్యవస్థ రద్దయ్యిందన్నారు. ఇప్పుడు ఆర్వోఆర్ 2024లో మానవ వనరుల అవసరం ఎక్కువని, పేదలకు న్యాయం చేయాలంటే వీరి అవసరం ఎంతో ఉందన్నారు. రెవెన్యూ చట్టాల మీద దశాబ్ద కాలం పని చేసిన అనుభవం ఉందని, సర్వే చేయగల సమర్ధులు ఉన్నారన్నారు. వీరందరినీ రెవెన్యూ శాఖలో విధులు కేటాయించడం ద్వారా గ్రామీణ పేదలకు సత్వర సేవలందించేందుకు వీలవుతుందన్నారు. ఈ పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను అప్పటి చీఫ్ జస్టిస్ సింఘ్వి, సీనియర్ ఐఏఎస్ అధికారులు కొప్పుల రాజు, టి.విజయ్ లు కొనియాడారు. అలాగే ప్రపంచ దేశాలెన్నో ఇక్కడీ వ్యవస్థను స్టడీ చేసి అమలు చేస్తున్నారన్నారు. ఎలాగూ ప్రతి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నందున చట్టాల మీద అవగాహన కలిగిన వీరిని ఎంపిక చేయడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు.

పరిష్కారాలు కష్టం

ఆర్వోఆర్ చట్టం 2024 ముసాయిదాపై కొందరు విమర్శిస్తున్నారని, ఐతే పరిష్కార మార్గాలు చూపడం కష్టమని సీఎమ్మార్వో పీడీ వి.లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. సామాన్యులకే న్యాయం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిలు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే ఉన్నతమైన చట్టంగా నిలుస్తుందని, ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. మొదటి సారి ఓ చట్టాన్ని ప్రజల్లో ఉంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారన్నారు. ఇప్పటికే 19 రోజుల్లో వందలాది మెయిల్స్, లేఖల ద్వారా చట్టంపై అభిప్రాయాలు వచ్చాయన్నారు. చట్టం రూపకల్పన బాధ్యతలను ప్రాక్టికల్ గా పని చేస్తోన్న భూమి సునీల్ కి అప్పగించారని, ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందన్నారు. చట్టం గురించి బాగా తెలిసిన పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్లను రెవెన్యూలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు. రెవెన్యూ చట్టాల గురించి చాలా మందికి తెలియదని, ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకున్నప్పుడే న్యాయం పొందే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో డీఎల్స్ శ్రీకాంత్, అడ్వకేట్స్ మల్లేష్ యాదవ్, అడ్వకేట్ జీవన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ శంకరయ్య, కుమారి నాగేష్, మంచాల నరసింహ, సాయిలు, ముత్తయ్య, మహేష్, పారా లీగల్& సర్వేయర్స్ పాల్గొన్నారు.

Read More : ROR Act 2024: ఆర్వోఆర్ చట్టం ప్రతి ఒక్కరిది

Advertisement

Next Story

Most Viewed