కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా

by Y.Nagarani |   ( Updated:2024-10-22 03:07:05.0  )
కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియ కోసం బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేసే బాధ్యతలను ప్లానింగ్ బోర్డు తీసుకున్నది. అవసరమైన సిబ్బందిని కూడా ఆ విభాగమే సమకూర్చుకుంటున్నది. మొత్తం మూడు దశల్లో జరిగే ఈ ప్రక్రియపై రెండు విభాగాలూ జాయింట్‌గా షెడ్యూలు రూపొందించుకున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లకు మూడు వారాల చొప్పున సమయాన్ని కేటాయించి థర్డ్ ఫేజ్‌లో మాత్రం డాటాను ప్రాసెసింగ్ చేసి నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చేలా ప్రణాళిక రూపొందింది. సర్వేలో భాగంగా మొత్తం 55 ప్రశ్నలతో ప్రొఫార్మా సిద్ధమైంది. కుటుంబ పెద్ద, సభ్యుల వివరాల మొదలు ఆ కుటుంబాలకున్న ఇంటి స్వభావం, స్థలం, వాహనాలు, వృత్తి, పశువులు, స్థిరచరాస్తులు, తాగునీటి కనెక్షన్, వంటగ్యాస్, ఇంటికోసం తీసుకున్న లోన్... ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ వివరాల సేకరణకు 90 వేల మంది ఎన్యూమరేటర్లు, 12,500 మంది సూపర్‌వైజర్లను ప్లానింగ్ బోర్డు నియమించనున్నది.

ఫస్ట్ ఫేజ్ లో ఇలా..

మొదటి ఫేజ్‌లోని మూడు వారాల వ్యవధిలో ఒక వారం హౌజ్ లిస్టింగ్, ముందస్తు సర్వే అవసరాలకు ఉద్దేశించినది. స్టీరింగ్ కమిటీ నియామకం, ప్రశ్నావళి పరిశీలన, మాన్యువల్ తయారీ, జిల్లా కలెక్టర్లతో సమావేశాలు, ఎన్యూమరేషన్ బ్లాక్2ల ఏర్పాటు, మాస్టర్ ట్రెయినర్‌లతోపాటు ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణ, డిజిటల్ యాప్ తయారీ, ప్రయోగాత్మక వినియోగం తదితరాలు ఉంటాయి. మిగిలిన రెండు వారాల్లో ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి వివరాలను సేకరించడం ప్రధాన యాక్టివిటీ. మొదటివారంలో జరిగే ప్రక్రియ కోసం ప్రతీ నలుగురు ఎన్యూమరేటర్లకు ఒకరి చొప్పున సూపర్‌వైజర్లను ప్లానింగ్ బోర్డు నియమిస్తే తర్వాతి రెండు వారాల్లో ప్రతీ ఎనిమిది మందికి ఒకరి చొప్పున కేటాయించనున్నది. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేసి ప్రతీ ఎన్యూమరేటర్ రోజుకు 80 కుటుంబాల చొప్పున రెండు వారాల వ్యవధిలో వివరాలను రికార్డు చేసేలా ప్లానింగ్ ఖరారైంది. ఫస్ట్ ఫేజ్‌లోని మూడు వారాల పనులు సమాంతరంగా జరిగేలా మార్గదర్శకాలు రూపొందాయి.

సెకండ్ ఫేజ్ లో..

ఇక సెకండ్ ఫేజ్‌లో మూడు వారాల వ్యవధిలో వివరణాత్మక క్షేత్రగణన కోసం ప్లానింగ్ బోర్డు షెడ్యూలు రూపొందించింది. ఫస్ట్ ఫేజ్‌లో క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలను పరిశీలించి క్రాస్ చెక్ చేసుకోడానికి ఉద్దేశించిన పనులు జరుగుతాయి. ప్రతీ ఎన్యూమరేటర్ రోజుకు 10 కుటుంబాల చొప్పున రెండువారాల పాటు ఈ పనుల్లో నిమగ్నమవుతారు. డాటా సేకరణలో ఎలాంటి తప్పులు, లోపాలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా మొత్తం 55 ప్రశ్నలను క్రాస్ చెక్ చేస్తారు. ఇందుకోసం ఈ ఫేజ్‌లోని మొదటి రెండు వారాలను కేటాయించుకుని చివరి (మూడవ) వారాన్ని మిస్ అయిన ఇండ్ల నుంచి వివరాలను సేకరించడం, వారి నుంచి తీసుకున్న అంశాలను ప్రింటవుట్ తీసి వారికి అందజేయడం, మరో కాపీ మీద వారి నుంచి సంతకాలు తీసుకుని ప్రభుత్వ సిబ్బంది రికార్డు కోసం ఫైలింగ్ చేయడం... తదితరాలకు వినియోగించనున్నారు. ఈ రెండు దశల్లోనూ (ఫస్ట్, సెకండ్ ఫేజ్) ఎన్యూమరేటర్లు తీసుకున్న వివరాలను పర్యవేక్షించడానికి సూపర్‌వైజర్లు కూడా వారికి అప్పజెప్పిన పనులు చేపడతారు.

థర్జ్ ఫేజ్ లో..

ఇక థర్డ్ ఫేజ్‌కు ఉద్దేశించిన రెండు వారాల వ్యవధిని అన్ని కుటుంబాల నుంచి తీసుకున్న వివరాలను డేటా ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగించుకోనున్నారు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్, డిజిటల్ యాప్‌ల మధ్య అనుసంధానం ఉండేలా ముందుగానే ప్లానింగ్ డిపార్టుమెంటు కసరత్తు చేసినందున గ్రామాలవారీగా డాటా బేస్ రెడీ అయ్యేందుకు వెసులుబాటు కలగనున్నది. ఈ రెండు వారాల వ్యవధిలోనే మొత్తం కులాలు, కుటుంబాలు, ఆర్థిక అంశాలు.. వీటన్నింటితో కూడిన నివేదికను కూడా ప్లానింగ్ డిపార్టుమెంటు సిద్ధం చేస్తుంది. కులగణన కోసం మొత్తం ఎనిమిది వారాల సమయం పడుతుందని వేసుకున్న అంచనా ప్రకారం డిసెంబరు 9వ తేదీకల్లా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది స్టేట్ బీసీ కమిషన్, ప్లానింగ్ డిపార్టుమెంటు లక్ష్యం. మొత్తం 8 వారాల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని పరిశీలించి, అవసరమైతే రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయడంపై ప్రభుత్వం, స్టేట్ బీసీ కమిషన్ దృష్టి పెట్టనున్నాయి. కులగణన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

గవర్నమెంట్ స్కీమ్స్ కు సైతం..

కులగణనలో సేకరించే వివరాలను రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి కూడా ప్రభుత్వం వినియోగించుకునే అవకాశమున్నది. ఈ వివరాల సేకరణలో కులం, ఉపకులం, మతం, ఆధార్ కార్డు నంబర్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, అంగవైకల్య ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల సంప్రదాయ వృత్తి, ఉపాధి, నెలవారీ జీతం, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగం, వృత్తితో వస్తున్న వ్యాధులు, కూలీలు/కార్మికులైతే వారి రోజువారీ వేతనం, వార్షిక ఆదాయం, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపు, బ్యాంకు ఖాతా నెంబర్, కుటుంబానికున్న సాగుభూమి విస్తీర్ణం, పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ప్రస్తుతం వంట అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా?.. లేదా? ఇంటి స్వభావం ఏంటి (పూరిల్లు, పెంకుటిల్లు, మట్టి మిద్దె, రేకుల పైకప్పు, సిమెంటు కాంక్రీట్ శ్లాబ్, టాయ్‌లెట్ సౌకర్యం, తాగునీటి కనెక్షన్, వాడుతున్న వాహనాలు... ఇలాంటివన్నీ ఉంటాయి. ఆయా కుటుంబాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన రాజకీయపరమైన అవకాశాలను కూడా ఈ సర్వేలో ప్రభుత్వ సిబ్బంది నమోదు చేయనున్నారు.

ఇతర రాష్ట్రాల పద్ధతుల విశ్లేషణ

ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన ప్రక్రియ జరిగినందున అక్కడ రూపొందించిన ప్రశ్నావళి, చేపట్టడానికి అనుసరించిన పద్ధతి (ఫిజికల్/డిజిటల్), ప్రభుత్వం తరపున పాల్గొన్న సిబ్బంది (ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు), పట్టిన సమయం, అయిన ఖర్చు, డాటా ప్రాసెసింగ్‌కు తీసుకున్న సమయం... ఇలాంటివాటిపై స్టేట్ బీసీ కమిషన్, ప్లానింగ్ డిపార్టుమెంటు ప్రతినిధులు లోతుగా విశ్లేషించారు. కర్ణాటకలో స్టేట్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో (2015 ఏప్రిల్ 11 నుంచి మే 30 వరకు) మొత్తం 50 రోజుల్లో జరిగింది. మొత్తం 1.35 కోట్ల కుటుంబాల నుంచి 1.33 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 22,190 మంది సూపర్‌వైజర్లు వివరాలను సేకరించారు. చివరకు 2024 ఫిబ్రవరి 29న ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించగా మొత్తం ఫిజికల్ పద్ధతిలో నిర్వహించిన ఈ ప్రక్రియకు రూ. 162 కోట్లు ఖర్చయినట్లు తేలింది. బిహార్‌లో సైతం సాధారణ పరిపాలన శాఖ 45 రోజుల్లో 2.77 కోట్ల కుటుంబాల వివరాలను 2.34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 40 వేల మంది సూపర్‌‌వైజర్లు కలిసి ఫిజికల్, డిజిటల్ పద్ధతిలో రూ. 410 కోట్ల ఖర్చుతో కంప్లీట్ చేసి 2023 అక్టోబరు 2న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం పది రోజుల్లో ప్లానింగ్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఈ ఏడాది జనవరి 19 నుంచి 28 తేదీల మధ్యలో 1.67 కోట్ల కుటుంబాల వివరాలను గ్రామ వాలంటీర్లు, కార్యదర్శుల ద్వారా డిజిటల్ పద్ధతిలో సేకరించింది. కానీ ప్రభుత్వానికి ఇంకా నివేదికను అందజేయలేదు. ఈ రాష్ట్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ బీసీ కమిషన్, ప్లానింగ్ డిపార్టుమెంటు సమగ్ర కులగణనకు నిర్దిష్టమైన షెడ్యూలు, ప్రోగ్రామ్‌ను ఖరారు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed