రాత్రి వేళ పాలిటెక్నిక్ తరగతులకు ఏపీలో అనుమతి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-22 05:21:39.0  )
రాత్రి వేళ పాలిటెక్నిక్ తరగతులకు ఏపీలో అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్ :పగలు పనిచేసి, రాత్రివేళ తరగతులకు హాజరై పాలిటెక్నిక్ చదువుకోవాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలు సహా పలు కారణాలతో పది, ఐటీఐలతో ఎంతోమంది చదువు మధ్యలో ఆపేసి, ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం రాత్రి వేళ పాలిటెక్నిక్ తరగతులకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు రాత్రి పూట చదువుకునేందుకు వీలుగా 6 పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 6గంటల నుంచి 9గంటల వరకు, అదివారాల్లో పూర్తిగా తరగతులు నిర్వహించనున్నారు. గతంలో ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్‌ చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఇప్పుడు డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు ఏపీ సాంకేతిక విద్యాశాఖ అనుమతించడం విశేషం.

విశాఖలో 3 కళాశాలలకు, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో 1 కళాశాలకు రాత్రి పూట తరగతుల నిర్వహణకు అనుమతించారు. ఆయా కళాశాలల్లో 429సీట్లు అందుబాటులో ఉండగా, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కళాశాలల్లోనే అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ఉద్యోగం చేసే ప్రాంతం, లేదా నివాసం విద్యాసంస్థకు 50 కి.మీ. లోపు ఉండాలనే నిబంధన ఉంది. ఈ డిప్లొమా మూడేళ్లు కాగా.. ఈ విధానంలో రెండేళ్లు, రెండున్నరేళ్ల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు వచ్చేవారు అర్హత ధ్రువపత్రాలు, చెల్లించాల్సిన ఫీజుతో ఆయా పాలిటెక్నిక్‌లకు నేరుగా హాజరు కావాలని సూచించారు. రెండేళ్ల కోర్సులు కంప్యూటర్, ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండున్నరేళ్ల కోర్సుల విషయానికి వస్తే.. కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌(ఆయిల్‌ టెక్నాలజీ), కెమికల్‌(పెట్రోకెమికల్‌)లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed