తెలంగాణకు 5,200 కోట్ల పెట్టుబడులు.. ఫ్రెండ్లీ పాలసీపై నమ్మకంతోనే..

by Ramesh Goud |   ( Updated:2024-01-18 05:00:56.0  )
తెలంగాణకు 5,200 కోట్ల పెట్టుబడులు.. ఫ్రెండ్లీ పాలసీపై నమ్మకంతోనే..
X

దిశ వెబ్‌డెస్క్: దావోస్ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. వెబ్ వెర్క్స్ అనే సంస్థ తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు 5200 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ వెబ్ వెర్క్స్ సంస్థ డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి అయిన ఐరన్ మౌంటెన్ కి అనుబంధ సంస్థ. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపిన అనంతరం 5200 కోట్లు పెట్టుబడులు పెట్టెందుకు వెబ్ వెర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టెందుకు ఈ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు. పెట్టుబడిదారులు అందుకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం, దేశంలో తమ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరించడంపై ఐరన్ మౌంటైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన ప్రాధాన్యతలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా డేటా సెంటర్‌లలో 100% పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నాము. దీనిని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు మరియు పునరుత్పాదక ఇంధనం రెండింటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చిందని విలియం మీనీ అన్నారు.

Advertisement

Next Story