కొత్త మిషన్లను సమకూర్చిన బల్దియా..పెరగనున్న ఎర్లీబర్డ్ కలెక్షన్

by Hamsa |
కొత్త మిషన్లను సమకూర్చిన బల్దియా..పెరగనున్న ఎర్లీబర్డ్ కలెక్షన్
X

దిశ, సిటీబ్యూరో : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను వీలైనంత ఎక్కువగా ముందుగానే వసూలు చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే క్షేత్ర స్థాయిలో ట్యాక్స్ వసూలు చేసే బిల్ కలెక్టర్లకు సరి కొత్త కలెక్షన్ మిషన్లను సమకూర్చింది. ఈ యంత్రాల ద్వారా బకాయిదారుడు తనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆన్ లైన్ చెల్లింపు యాప్ లను వినియోగించి ట్యాక్స్ పే చేయవచ్చు. గురువారం ఈ యంత్రాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిల్ కలెక్టర్లకు అందజేశారు. అంతేగాక, వీటి వినియోగంపై బిల్ కలెక్టర్లకు ఒక రోజు శిక్షణ కూడా ఇచ్చారు. ఇదివరకు బకాయిదారులు కేవలం ఆర్టీజీఎస్ ద్వారా, జీహెచ్ఎంసీ బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ట్యాక్స్ చెల్లించేవారు. కానీ ఈ కొత్త మిషన్ అందుబాటులోకి రావటంపై ఇక బకాయిదారులు తమకు అందుబాటులో ఉన్న గూగుల్ పే, పేటీం, ఫోన్ పే, ఇతరత్ర యాప్‌ల ద్వారా కూడా పన్ను చెల్లించే వెసులుబాటు కల్గనుంది.

వీటితో పాటు చెక్‌ల ద్వారా వచ్చే చెల్లింపులను కూడా స్వీకరించాలని ఉన్నతాధికారులు బిల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రారంభ మాసం కావటంతో వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందస్తు చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటునిస్తూ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ స్కీం కలెక్షన్ టార్గెట్లకు ఈ కొత్త మిషన్లు తోడు కావటంతో ఈ నెలాఖరు వరకు టార్గెట్ పెట్టుకున్న రూ.750 కోట్ల కలెక్షన్, లక్ష్యాన్ని మించి దాటుతుందని అధికారులు అంచనాలేస్తున్నారు.

12 రోజుల్లో రూ.170 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మరుసటి రోజు నుంచి ఎర్లీ బర్డ్ అమల్లోకి రావటంతో జీహెచ్ఎంసీకి కేవలం 12 రోజుల వ్యవధిలోనే రూ.170 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అయింది. వీటిలో ఎక్కువగా ఆన్‌లైన్‌లో వచ్చిన చెల్లింపులే కావటం, దీనికి తోడు సరి కొత్త మిషన్లు అందుబాటులోకి రావటంతో ఈ నెలాఖరుకు ముందే రూ.750 కోట్ల లక్ష్యాన్ని అధిగమించవచ్చునని అధికారులు అంచనాలేస్తున్నారు. కలెక్షన్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇంకా సమయముంటే, ఆ సమయానికి తగిన విధంగా మళ్లీ టార్గెట్ నిర్ణయించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed