ఒక్కొక్కరితో ‘30’ మినిట్స్..? ఓడిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ

by Shiva |
ఒక్కొక్కరితో ‘30’ మినిట్స్..? ఓడిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ గురువారం గాంధీ భవన్‌కు రానున్నది. కమిటీ లీడ్ కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లు రానున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. క్యాండిడేట్స్‌తో వన్ టూ వన్ నిర్వహించనున్నారు. ఒక్కో అభ్యర్థితో దాదాపు 30 నిమిషాల పాటు లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? నేతల మధ్య సమన్వయం కుదరలేదా? క్షేత్రస్థాయి కార్యకర్తలు సహకరించారా? ఆయా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత ? క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? వంటి అంశాలపై వివరణ అడగనున్నది. ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఏమిటీ ? అనే వివరాలను త్రీ మెన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరించనున్నది. దాని ప్రకారం కురియన్ కమిటీ ఓ రిపోర్టు తయారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మూడు రోజులు అధ్యయనం..?

ఎన్నికలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు కురియన్ కమిటీ దాదాపు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఓడిపోయిన సెగ్మెంట్ల ఇన్‌చార్జీ మంత్రులు, పార్లమెంటు అబ్జర్వర్లు, ఇతర కీలక నాయకులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఎంపీ అభ్యర్థులు ఇచ్చిన సమాచారం, నియోజకవర్గాల్లోని ఇతర నేతలు చెప్పిన వివరాలను బేరీజు వేయనున్నారు. ఆయా ఫీడ్ బ్యాక్‌లను వేర్వేరుగా నివేదికలు తయారు చేసి విశ్లేషణ అనంతరం కాంగ్రెస్ ఓటమిపై త్రీ మెన్ కమిటీ ఏఐసీసీకి తుది రిపోర్టును ఇవ్వనున్నది.

ఆ ఎనమిది సీట్లపైనే..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్..మెదక్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజవర్గాల్లో ఓడిపోవడం దారుణమని గతంలో ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. పైగా ఆయా సీట్లలో బీజేపీ గెలవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది. తాము అంచనా వేసిన 14 సీట్లలో కనీసం పది కూడా దాటలేదని నిరుత్సాహానికి గురైంది. దీంతో లోపాలను పసిగట్టి సరిదిద్దుకోవడానికే ఈ కమిటీ పర్యటన అంటూ ఓ నేత తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసిన ఏఐసీసీ, విడతల వారీగా రిపోర్టులు తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed