'10 వేల కోట్ల' ఆశలు.. వరాలు కురిపిస్తారని భారీ అంచనాలు!

by GSrikanth |   ( Updated:2023-02-19 05:41:43.0  )
10 వేల కోట్ల ఆశలు.. వరాలు కురిపిస్తారని భారీ అంచనాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్పెషల్ డెవలప్‌‌మెంట్ ఫండ్ పేరిట సీఎం దగ్గర రూ.10 వేల కోట్ల నిధులు ఉన్నాయి. బడ్జెట్‌‌లో కేటాయించిన ఆ నిధులే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తలరాతను డిసైడ్ చేయనున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను కేటాయించినందున ఏప్రిల్ నుంచి హామీల పరంపర మొదలయ్యే అవకాశమున్నది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అంటే సెప్టెంబరు లేదా అక్టోబరులో ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. అప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది. దీంతో ఏప్రిల్ మొదలు సెప్టెంబరు చివరి వరకు ఆరు నెలల వ్యవధిలోనే ఈ ఫండ్స్ రిలీజ్‌కు సంబంధించి కేసీఆర్ హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. సగటున ఒక్కో నియోజకవర్గానికి రూ.84 కోట్ల చొప్పున ఖర్చు చేయడానికి వెసులుబాటు ఉన్నది.

వీక్ సెగ్మెంట్లపై ఫోకస్!

బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందనే నియోజకవర్గాలపై పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉండి, ఈసారి గెలుపు అనుమానమే అనే బలహీన అసెంబ్లీ సెగ్మెంట్లపైనే అధికార పార్టీ దృష్టి సారించే అవకాశమున్నది. అభివృద్ధి పనులకు నిధులను భారీ స్థాయిలో విడుదల చేసి ప్రజల మనసును గెల్చుకోవాలన్నది కేసీఆర్ వ్యూహం. డెవలప్‌‌మెంట్ పనుల పేరుతో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవచ్చన్నది రూలింగ్ పార్టీ ప్లాన్. దీనికనుగుణంగా ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఆ నిధులపై కన్నేశారు. కేసీఆర్ బహిరంగసభలను నిర్వహించేలా స్కెచ్ వేస్తున్నారు. ఎలాగూ పర్యటన సందర్భంగా హామీలతో పాటు నిధులను రిలీజ్ చేస్తారనే ఆశలు పెట్టుకున్నారు.

విపక్ష ఎమ్మెల్యే సెగ్మెంట్లపై పక్షపాతం

ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ప్రజల్లో, ఎమ్మెల్యేల్లో ఉన్నది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్లలో నామమాత్రపు ఫండ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయనే అభిప్రాయం సరేసరి. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఎస్డీఎఫ్ విడుదలలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు విడుదలైన వందలాది కోట్ల రూపాయల నిధుల అంశాన్ని ఉదహరించారు. అక్కడ అభివృద్ధి పరుగులు తీస్తుంటే తాను ప్రాతినిధ్యం వహించే దుబ్బాకలో మాత్రం ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు సైతం సర్కారు నిధులను విడుదల చేయడంలేదని ఆరోపించారు.

అధికారులకు సవాలుగా ఫండ్స్ రిలీజ్

రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్డీఎఫ్ కోటా కింద రూ.10 వేల కోట్లను కేటాయించడంతో వాటిని సమకూర్చుకోవడంపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరుల నుంచి సమీకరించుకుని ఎలక్షన్ షెడ్యూలు విడుదలయ్యే లోపు సిద్ధం చేసుకోవడం సవాలుగా మారింది. రెగ్యులర్‌‌గా వివిధ వెల్ఫేర్ స్కీమ్‌‌లకు నిధులను సిద్ధం చేసుకోవడంతోపాటు ఈసారి ఎన్నికల సందర్భంగా ఎస్డీఎఫ్ కోసం భారీ స్థాయిలో సమకూర్చడంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తున్నది. సంక్షేమ పథకాలకు వచ్చే ఏడాది మార్చి వరకు గడువు ఉన్నా ఎస్డీఎఫ్ విషయంలో మాత్రం సెప్టెంబరు చివరికల్లా పూర్తిగా రూ.10 వేల కోట్లను రెడీ చేయాల్సి ఉంటుందనేది వారి ఆవేదన.

నెలకు రూ.1500 కోట్లు..

ఎస్డీఎఫ్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆరు నెలల సమయమే ఉన్నందున ఏప్రిల్ నుంచే నియోజకవర్గాల డెవలప్‌‌మెంట్ వర్క్స్ మీద ప్రభుత్వం దృష్టి సారించనున్నది. ప్రతి నెల సగటున కనీస స్థాయిలో రూ.1,500 కోట్లను కేవలం అసెంబ్లీ సెగ్మెంట్ల అభివృద్ధి పనుల కోసమే రిజర్వు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోయినా ఈసారి ఎన్నికలు ఉన్నందున చివరి రోజుల్లో కంటికి కనిపించేలా పనులను పూర్తి చేయడం కలిసొస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

జాబితాను రెడీ చేస్తున్న ఎమ్మెల్యేలు

నియోజకవర్గ సమస్యలు, పెండింగ్ పనులను లిస్టుగా తయారుచేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. జిల్లా అధికారులతో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడినట్లు తెలిసింది. ఎన్నికల మెనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించే హామీల సంగతి ఎలా ఉన్నా ఈ లోపునే అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోడానికి ఎస్డీఎఫ్ నిధులను అస్త్రంగా వాడుకోనున్నది. మండలాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంత హామీ ఇవ్వవచ్చునో కేసీఆర్ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీలను ఈ ఫండ్స్ ద్వారా ఇరికించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.

ఇవి కూడా చదవండి : BJP సోషల్ మీడియా బృందంపై పోలీసుల స్పెషల్ ఫోకస్!

Advertisement

Next Story

Most Viewed