వారికి గుడ్ న్యూస్.. ‘పింఛన్ల’పై కేసీఆర్ కీలక నిర్ణయం.!

by Shyam |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జూలై 13న ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె-పట్టణ ప్రగతి లాంటి అంశాలను ఎజెండాలో పెట్టినట్లు సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పలు కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కొన్ని కొత్త పథకాలను ప్రకటిస్తుండడం, ఇప్పటికే అమలవుతున్న పథకాల పేర్లను మారుస్తుండటం నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటం గమనార్హం. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలికిన తర్వాత కేబినెట్ భేటీ జరగడం ఇది నాలుగో సారి.

ఇటీవల వాసాలమర్రి, సిరిసిల్ల, వరంగల్ పర్యటనల సందర్భంగా పలు కొత్త పథకాలను ప్రకటించడం, మరికొన్ని హామీలను ఇచ్చిన నేపథ్యంలో వీలైనంత తొందరగా వాటిని అమలు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వాటికి సంబంధించి ఆర్థికపరమైన అనుమతులపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న ఆసరా పింఛను పథకాన్ని ఆగస్టు నుంచి 57 ఏళ్ళు పైబడినవారికి కూడా వర్తింపజేస్తామని బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో దానికి అవసరమైన ఆర్థిక వనరులపై ఈ సమావేశంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రకటన ద్వారా అదనంగా సుమారు ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులుగా చేరే అవకాశం ఉంది.

దీనికి తోడు ఏపీ, తెలంగాణ మధ్య ఘర్షణ రూపానికి దారితీసిన కృష్ణా జలాల అంశంలో భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోడానికైనా ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు అప్పగించే తీర్మానాన్ని కూడా పొందే అవకాశం ఉంది. సీఎంఓ వర్గాలు మాత్రం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed