జూన్‌లో రిజిస్ట్రేషన్ల రికార్డు బ్రేక్!

by Shyam |   ( Updated:2021-06-30 21:10:25.0  )
Telangana Registrations Dharani Portal
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ ​వ్యాప్తి ప్రబలంగా ఉంది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందంటూ ప్రచారం జరిగింది. కానీ రియల్ ​ఎస్టేట్​ రంగంపై మాత్రం ఎలాంటి దుష్ప్రభావం లేదని లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలోనూ రూ.లక్షలు వెచ్చించడానికి భయపడడం లేదు. అన్ని వ్యాపారాలు నిలిచిపోయాయంటూ ఓ వైపు జనం ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయి. కానీ ఆస్తుల కొనుగోళ్లలో మాత్రం గతానికి మించిన సత్తా కనబడుతుండడం గమనార్హం. సంపన్న వర్గాలెవరిపైనా కరోనా వైరస్ ​తీవ్రత లేదని చెప్పేందుకు రిజిస్ట్రేషన్ల లెక్కలు చెబుతున్నాయి. మే నెలలో వైరస్ ​వ్యాప్తి తీవ్రంగా ఉండడం, లాక్​డౌన్​ ప్రకటించడం ద్వారా రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అప్పటికీ 40 వేలకు దగ్గరలోనే లావాదేవీలు జరిగాయి. జూన్​ నెలలో మాత్రం రికార్డులు బద్దలు కొట్టారు. వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య 2 లక్షలుగా నమోదు కావడం విశేషం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రెవెన్యూ లభించింది. కరోనా వైరస్​భయపెడుతోన్న కాలంలోనూ రియల్​ ఎస్టేట్​ వ్యాపారం జోరందుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఇక హెచ్ఎండీఏ పరిధిలోని సబ్​రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ప్రతి రోజూ కొనుగోలు, అమ్మకందార్లతో నిండిపోతోంది. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని మీటింగులు ఉన్నా స్లాట్లను అటెండ్​ చేయడం తహశీల్దార్లు/జాయింట్ రిజిస్ట్రార్లకు తలకు మించిన భారంగా మారింది. అటు సమావేశాలు, ధరణి సమస్యల పరిష్కారం, ఇటు రిజిస్ట్రేషన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

జులైలో రెట్టింపు ఉత్సాహం

ఇక ఈ నెలలో క్రయ విక్రయాలు రెట్టింపు కానున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల విలువలను, రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచనుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఒకటీ రెండు రోజుల్లోనే సీఎం కేసీఆర్​కు నివేదికను సమర్పించనుంది. దాదాపు రిజిస్ట్రేషన్ విలువలను రెట్టింపు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఒక్క నెలలోనే ఆసక్తి కలిగిన కొనుగోలుదార్లంతా రిజిస్ట్రేషన్లకు పోటీ పడే అవకాశం ఉందని సబ్​రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు అంచనా వేస్తున్నారు. 30 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కు వెళ్తే రెట్టింపు చార్జీలు పడతాయి. అందుకే అప్పు చేసైనా ఈ నెలలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు పోటీ పడే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయాన్ని రియల్ ​ఎస్టేట్​వ ర్గాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. వచ్చే నెలలో లావాదేవీలు భారంగా మారనున్నాయి. పైగా వైట్​మనీగా చూపించే మొత్తం కూడా రెట్టింపు కానుంది. ఇప్పటికిప్పుడు బహిరంగ మార్కెట్ ధరలు పెరగవు. కానీ ప్రభుత్వ ధరల ప్రకారం కొనుగోలు చేసే ధరలకు చెల్లిస్తోన్న మొత్తాన్ని నిజాయితీగా సంపాదించినదిగా లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఇదే అంశం ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. ఏ రియల్ ​ఎస్టేట్​ వ్యాపారి, ఏజెంటును కలిసినా వచ్చే నెలైతే కష్టం.. ఇప్పుడైతే బెస్ట్ ​అంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

జూన్​నెలలో భూముల లావాదేవీలు

దరఖాస్తులు పూర్తయినవి

రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు 84,047 75,901
విరాసత్​ 6,229 5,328
భాగ పంపకాలు 251 209
పెండింగ్​మ్యుటేషన్లు 12,747 12,669
నాలా కన్వర్షన్లు 3,023 2,608

మే నెలలో భూముల లావాదేవీలు

రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు 19,793 17,419
విరాసత్ 1,787 1,528
భాగ పంపకాలు 52 44
పెండింగ్​మ్యుటేషన్లు 3,730 3,712
నాలా కన్వర్షన్లు 931 785

జూన్​నెలలో వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు

రిజిస్ట్రేషన్లు: 91,771
రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం: రూ.1186.94 కోట్లు
బుక్కయిన స్లాట్లు: 58.735

Advertisement

Next Story