షర్మిలకు ఊహించని షాకిచ్చిన పోలీసులు

by Anukaran |
షర్మిలకు ఊహించని షాకిచ్చిన పోలీసులు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: లక్ష మందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి అట్టహాసంగా ప్రజల్లోకి వెళ్లాలని భావించిన వైఎస్ షర్మిలకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి కొన్ని షరతులు పెట్టారు. సంకల్పసభలో పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వైఎస్సార్ అభిమానులు, నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సమాయత్తం చేస్తున్నారు. పలుమార్లు ఖమ్మం సభపై కూడా చర్చించారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పర్మిషన్ ఇచ్చిన పోలీసులు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు. కేవలం ఆరువేల మందితో మాత్రమే సభ నిర్వహించాలని షరతులు పెట్టారు. అది కూడా సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే ఉండాలని సూచించినట్టు తెలిసింది.

అట్టహాసంగా అరంగేట్రం చేయాలని భావించిన షర్మిలకు ఊహించని షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఆరువేల మందితోనే సభ నిర్వహించుకోవాలని పర్మిషన్ రావడంతో సభ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో కూడా వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు పెద్దసంఖ్యలో కార్ల ర్యాలీ నిర్వహించాలని భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రోగ్రాం రద్దయింది. మళ్లీ ఇప్పుడు కొవిడ్ కారణంగా సభపై ఆంక్షలు విధించడంతో ఆదిలోనే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సభ నిర్వహణపై ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకే కావాలనే ఆంక్షలు విధించారని షర్మిల మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందు వల్లే షరతులు పెట్టారని ఆక్షేపిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మంలో పదిరోజుల నుంచి ప్రతిరోజూ 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరి వేల మందితో సభ నిర్వహిస్తే కొవిడ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story