భయమైతోంది.. మాలో కరోనా సోకినవాళ్లు ఉన్నారు!

by Aamani |
భయమైతోంది.. మాలో కరోనా సోకినవాళ్లు ఉన్నారు!
X

దిశ, ఆదిలాబాద్: ‘ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వస్తే ఇక్కడ పడరాని పాట్లు పడుతున్నాము. అడిగేవారు లేక క్షణం ఒక యుగం లా గడుపుతున్నాము. ఆకలితో అలమటిస్తున్నాము. ఒక్కో రూములో 10 నుంచి 20 మందిని కుక్కేశారు. జీతం ఊడబీకి పస్తులు ఉంచుతున్నారు. నివాస సౌకర్యం తొలగించి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇక్కడి ఇండియన్ ఎంబసీ ఒకటి, రెండు సార్లు భోజనం పెట్టినప్పటికీ, వేలాది మంది కష్టసుఖాలు చూసే పరిస్థితి లేదు. మాలో కరోనా సోకిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లతో సహా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాకు జీతంతో పని లేదు. ఇంటికి తీసుకెళ్తే ఎన్ని కష్టాలొచ్చినా అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి బతికేస్తాం’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరంతా గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడ వారు ప్రస్తుతం బాధలు అనుభవిస్తున్నారు.

నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. దుబాయ్, మస్కట్, ఒమన్, షార్జా, బెహరాన్, కువైట్, సౌదీ తదితర దేశాల్లో ప్రవాస తెలంగాణ వాసులు వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. దినసరి కూలీలు మొదలుకొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ వీసాతో పని చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. అదేవిధంగా టూరిస్ట్ వీసాలతో వెళ్లిన “ఖల్లివెల్లి” కార్మికులు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటారు. మరోవైపు యూఏఈ, సౌదీ, కువైట్ దేశాల నిబంధనలను అతిక్రమించి జైళ్లలో మగ్గుతున్నవారు కూడా చాలామందే ఉన్నారు.

అనేక అవస్థలు..

ఎడారి దేశాల్లో బతుకు పోరాటం చేస్తున్న ప్రవాస తెలంగాణ వాసులు అనేక అవస్థలు పడుతున్నారు. నెలన్నర రోజుల క్రితం కరోనా కేసులు గల్ఫ్ దేశాల్లో వెలుగుచూశాయి. అప్పటినుంచి అన్ని దేశాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. తొలి 15 రోజులు కంపెనీల యజమానులు సహకరించినప్పటికీ, భారీ కంపెనీలు సైతం మూతపడడంతో క్రమంగా ఇబ్బందులు మొదలయ్యాయని వారు తెలిపారు. 65 శాతం పైగా కార్మికుల జీతాలు తొలగించారని, దినసరి కూలీ పనులు కూడా దొరకడం కష్టంగా మారిపోయిందని నిర్మల్ కు చెందిన నవీన్ అనే యువకుడు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగాలు, జీతాలు పోవడంతోపాటు తమ వద్ద చిల్లిగవ్వ లేకుండా పోయిందని, తినడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందాడు. తాము ఇక్కడ జీతానికి కుదిరినప్పుడు నివాసయోగ్య సౌకర్యం కూడా కల్పించారని, ఇప్పుడు అది కూడా తొలగించారని తెలిపాడు. తన రూమ్ లో 12 మందిని ఉంచారని, మిగతా కొన్ని చోట్ల ఒక్కో రూములో 20 మంది దాకా కుక్కి పెట్టారని చెప్పాడు. తాను ఉండే రూములో జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల కార్మికులు ఉన్నారని తెలిపాడు. భారీ బహుళ అంతస్తులలో ఉండే రూమ్ లలో ఇప్పుడు భారతీయ కార్మికులు వేలకొద్ది ఉన్నారని… వారందరికీ ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తినడానికి తిండి కూడా దొరకడం లేదని చెప్పాడు.

కరోనా సోకిన వారితో కలిసి ఉంటున్నాం..

భారతీయ ఎంబసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో భోజన వసతి కల్పిస్తున్నప్పటికీ అందరికీ పూర్తి స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. మాలోనూ కరోనా సోకిన వాళ్ళు ఉన్నారు.. రూముల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉన్నా మావాళ్లలోనూ కరోనా బారిన పడినవారు ఉన్నారని, వారిని కూడా తీసుకెళ్లడం లేదని వాపోతున్నారు. ఈ పరిణామం తమ పట్ల ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎంబసీ అధికారులు చేస్తున్న సహాయం కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. అడపాదడపా ఆహార పొట్లాలు పైకి విసిరి వెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తమను ఎవరూ పట్టించుకోక మాకు కేటాయించిన ఇరుకు గదుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారితో కలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

మమ్మల్ని రప్పించండి…

అనేక అవస్థలతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న బాధితులను, తెలంగాణ ప్రవాస భారతీయులను తిరిగి ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నారు. తమకు ఇక్కడ జీతం ఇక అవసరం లేదని, ఇండియాకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తామని వారు పేర్కొంటున్నారు. ఇండియాలోనూ ప్రభావం ఉందని తమ కుటుంబ సభ్యులను తలుచుకుంటూ ఆందోళన చెందడం తప్ప ఇప్పటికిప్పుడు వారిని చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎలాగైనా తమను ఇండియాకు తీసుకువెళ్లాలని కోరుతున్నారు.

కేటీఆర్ పైనే భారం…

ప్రవాస భారతీయుల పట్ల ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ తమకు సహకరించేది మంత్రి కేటీఆర్ అని బాధితులు పేర్కొంటున్నారు. ఈ మేరకు తాము కేటీఆర్ కు ట్వీట్ కూడా చేశామని తెలిపారు. మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని వివిధ గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి తమను స్వస్థలాలకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

tags: Gulf Countries, Telangana People, Problems, Coronavirus, Embassy of India

Advertisement

Next Story