జానా, బీజేపీ పరువు తీస్తున్న మంత్రులు.. ఓటమి భయమేనా..?

by Shyam |   ( Updated:2021-03-31 09:31:38.0  )
జానా, బీజేపీ పరువు తీస్తున్న మంత్రులు.. ఓటమి భయమేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం రోజు రోజుకీ రాజకీయ వేడిని పుట్టిస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు సాగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు మంత్రులు జానారెడ్డి, బీజేపీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నోముల భగత్‌కు మద్దతు తెలుపుతూ.. వేరు వేరు ప్రాంతాల్లో, ఉమ్మడిగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డిలు ప్రచారం నిర్వహించారు.

దుబ్బాకలో గెలిచినట్టు ఇక్కడ కాదు

తెలంగాణలో అన్ని మతాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తుంది. మైనార్టీల సంక్షేమం కోసం కూడా పనిచేస్తుంది. కానీ, కొన్ని పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలనే కుట్రలు చేస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో గెలిచినట్టే మతాన్ని అడ్డుపెట్టుకొని గెలుపొందాలని చూస్తున్నారు. ప్రజలు వారి మాటలను నమ్మొద్దు. హాలియా పట్టణంలో ముస్లీంలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తా -హోంమంత్రి మహమూద్ అలీ

ఆ హక్కు మాకే ఉంది.. జానారెడ్డి ఏం చేశారు..?

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. నియోజకవర్గానికి జానారెడ్డి ఏమి చేశారని ఓట్లు అడుగుతున్నారు. ప్రజల అమాయకత్వంతో వరుసగా ఏడుసార్లు గెలిచిన జానా.. కనీసం సాగర్ మొదటి మేజర్‌కు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. 40 ఏండ్లుగా త్రాగు, సాగునీరు లేక సాగర్ నియోజకవర్గం ఎడారిగా మారింది. కానీ, సాగర్ ఎడమ కాలువ కింది చివరి భూములకు కూడా సమృద్ధిగా రెండు పంటలకు నీళ్లు అందించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదే.. దురదృష్టవశాత్తు నోముల నరసింహ్మయ్య అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. నోముల నర్సింహ్మయ్య 5 ఏండ్లు అధికారంలో ఉండాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారు. అదే ఆకాంక్ష కొనసాగాలని సీఎం కేసీఆర్ నోముల భగత్‌ను పోటీలోకి దించారు. ఈ ఎన్నికల్లో విజయం అధికార పార్టీదే -జగదీశ్ రెడ్డి

జానా రెడ్డి వద్దు.. నోముల భగత్ ముద్దు..!

‘జానారెడ్డికి చేతకాకపోతే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.. అంతేకానీ ఎన్నికల ప్రచారం వద్దనడం విడ్డూరంగా ఉంది. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధిని తెలియపరచాలి. ఇదే సమయంలో ఓటు వేయమని అభ్యర్థించడమే అభ్యర్థి లక్షణం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భగత్ కుమార్ విద్యావంతుడు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడు. జానారెడ్డి వృద్దుడు. శక్తి సామర్థ్యాలు తగ్గాయి.. పరిపాలన అందించలేరు. -తలసాని శ్రీనివాస్ యాదవ్

Advertisement

Next Story

Most Viewed