- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి జూడాల విధుల బహిష్కరణ
దిశ, న్యూస్ బ్యూరో: ”ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది సేవలను మనం మరువలేం. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారు నీరుగారిపోతే మనం ఏమీ చేయలేం…” ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు. కానీ, ఇప్పుడు ఆయన ఆశించినదానికి భిన్నంగా ఒక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బోధన, జనరల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు మార్చి 31వ తేదీ నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటూ ఉంటే వారికి వైద్య చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులకు సైతం ఆ ప్రమాదం ఉందని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ ఉపకరణాలు లేకుండా పనిచేయలేమంటూ ఐదు డిమాండ్లతో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ”యథావిధిగా ఆసుపత్రులకు వస్తాంగానీ… విధుల్లో మాత్రం పాల్గొనం” అని జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు విష్ణు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కి లేఖ అందజేశారు.
జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లు:
1. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సూచించిన మార్గదర్శకాల మేరకు విధుల్లో ఉన్న డాక్టర్లకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు అందజేయాలి.
2. కరోనా పేషెంట్లకు, ఐసొలేషన్ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు సమీపంలోనే హాస్టళ్ళలో వసతి సౌకర్యం కల్పించాలి.
3. కరోనా వైద్య సేవల కోసం హాజరయ్యే డాక్టర్లకు రవాణా సదుపాయం కల్పించాలి.
4. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది మొత్తానికి ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు చేపట్టాలి.
5. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ సహా వ్యక్తిగత రక్షణ కోసం అందుతున్న ఉపకరణాలను పర్యవేక్షించే బృందంలో జూనియర్ డాక్టర్లను కూడా వలంటీర్లుగా పరిగణించాలి. ఎప్పటికప్పుడు అవసరమైన సంఖ్యలో అందుతున్నాయో లేదో చూసే వెసులుబాటు ఉండాలి.
వారం రోజులుగా నలుగుతున్న సమస్య
నిజానికి జూనియర్ డాక్టర్లు ఇప్పుడు విధుల బహిష్కరణ నోటీసు ఇచ్చినా… వారం రోజుల క్రితమే గాంధీ ఆసుపత్రిలోని నర్సులు సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చారు. వ్యక్తిగత రక్షణకు తగిన సౌకర్యాలు లేకుండా ఐసొలేషన్ వార్డుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స ఎలా చేయగలుగుతామని ప్రశ్నించారు. కానీ, అధికారుల నుంచి సమాధానం రాలేదు. ఈ భయంతోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో చాలామంది నర్సులు విధులకు హాజరుకాకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఇంటికే పరిమితమయ్యారు. డాక్టర్లు కూడా చికిత్స చేస్తున్న క్రమంలో ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నామంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఈ విషయం ప్రధానమంత్రి వరకూ వెళ్ళింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక డాక్టర్‌తో పాటు మరో ముగ్గురు వైద్య సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ సోకి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలోనే పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ముంచుకొచ్చింది.
ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో చేరిన మూడేండ్ల చిన్నారికి నాలుగు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అప్పటివరకూ ఆ చిన్నారికి చికిత్స అందించిన పలువురు జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, బోధనా సిబ్బంది ఇన్‌ఫెక్షన్‌కు గురికావడంతో వారిని హోం క్వారెంటైన్‌కు పంపించారని విష్ణు ఆ లేఖలో గుర్తుచేశారు. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం చికిత్స చేస్తున్న డాక్టర్లకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గదర్శకాల మేరకు పీపీఈలు, ఎన్-95 మాస్కులు, ఇతర ఉపకరణాలు లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నోటీసుకు తీసుకెళ్ళినప్పుడు తగినసంఖ్యలో పీపీఈలను, ఇతర ఉపకరణాలను అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ, వారం రోజులైనా అవి అందలేదని, రిస్కు తీసుకుని సేవలందించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే దురదృష్టవశాత్తు ఇప్పుడు నీలోఫర్ సంఘటన జరిగిందని గుర్తుచేశారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమే అయినా మౌన నిరసన చేయక తప్పడంలేదన్నారు. పీపీఈలు, ఇతర రక్షణ పరికరాలను ఇచ్చేంతవరకు విధులకు హాజరుకాలేమని తేల్చి చెప్పారు. పేషెంట్లకు చికిత్స చేయాలనే కోరుకుంటున్నామని, కానీ ఆ క్రమంలో పేషెంట్ నుంచి ఇన్‌ఫెక్షన్‌కు గురై మిగిలిన పేషెంట్లకు అంటించరాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాజస్థాన్‌లో కరోనా పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో ఒక వైద్యుడి ద్వారా వందలాది మందికి ఈ వైరస్ వ్యాపించి ఉదాహరణను గుర్తుచేశారు.
కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి సమీపంలోనే ప్రత్యేకంగా హాస్టళ్లను లేదా హోటళ్ళలో వసతి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఫలితంగా డాక్టర్ల కుటుంబ సభ్యులకు వైరస్ రాకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందించాలని ఆయన ఆ నోటీసులో డీఎంఈని కోరారు.
Tags : Telangana, Junior Doctors, Strike, Notice, Personal Protective Equipment, Corona