కృష్ణ బోర్డు కిరికిరి.. పొలిటికల్​గానే సమాధానం చెప్పేందుకు తెలంగాణ రెడీ

by Shyam |
కృష్ణ బోర్డు కిరికిరి.. పొలిటికల్​గానే సమాధానం చెప్పేందుకు తెలంగాణ రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జల వివాదాలపై తెలంగాణ కౌంటర్​ అటాక్​కు సిద్దమవుతోంది. ప్రగతిభవన్​ నుంచే దీనిపై మంత్రులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రాజకీయంగానే అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్​ కాకుండా… దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు ఏపీ వ్యాఖ్యలపై ఇరిగేషన్​ ఉన్నతాధికారులు ఎలాంటి కామెంట్లు చేయరాదంటూ బుధవారం రాత్రి సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయపరంగానే దీన్ని ఎదుర్కొవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఏపీ కూడా చెప్పినట్టుగా సీఎం జగన్​ కేంద్రానికి లేఖ పంపారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర జలశక్తికి జల వివాదాలను వివరిస్తూ లేఖ పంపించారు.

మీ ప్రజల కోసమైనా ఆపండి

ఏపీ కేబినెట్​లో సీఎం జగన్​, మంత్రులు చేసిన కామెంట్లను అదే స్థాయిలో తిప్పికొట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ కేబినెట్​ భేటీ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని, మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడటం లేదని, రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలంటూ సీఎం ప్రశ్నించినట్లు చెప్పుతున్నారు. అయితే తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జగన్ సూచించారు.

అదే విధంగా విద్యుత్ విషయంలో మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సీఎం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ కూడా అదే రాగం అందుకోనుంది. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, వారి కోసమైనా కృష్ణాలో అదనంగా వాడుకుంటున్న నీటిని వాడుకోవద్దని, అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని ఏపీ ప్రజలు కూడా తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏపీకి ఉంటుందనే సమాధానం ఇవ్వనుంది.

విమర్శలకు పదును

మరోవైపు ఇప్పటికే తెలంగాణ మంత్రులు ఏపీపై ఫైర్​ అవుతున్నారు. దక్షిణ తెలంగాణతో పాటుగా ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రులు కూడా కృష్ణా జల దోపిడిపై ఏపీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఏపీ మంత్రులు బుధవారం వరకు కూడా సైలెంట్​గానే ఉన్నారు. బుధవారం ఏపీ కేబినెట్​ భేటీ తర్వాత అక్కడి మంత్రులు విమర్శలకు పదును పెంచారు. నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వమే అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని, శ్రీశైలంలో 848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలమని, తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉందని, కృష్ణా బేసిన్‌లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుందని, ఈ అంశాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు.

ఇరిగేషన్‌ అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని, శ్రీశైలం డ్యామ్‌ నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుందని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యవహారశైలిపై నేడే ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్న మంత్రి తెలిపారు. రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని, తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జలవివాదంపై దృష్టి సారించిన ఏపీ కేబినెట్‌ రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసింది.

ఇదే అదును

మరోవైపు సంగమేశ్వరంతో పాటుగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా అంశాలను సేకరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా సంగమేశ్వరం నిర్మిస్తున్న చిత్రాలతో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై త్వరలోనే నిపుణుల కమిటీ వెళ్తుందని కేంద్రం ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం పనులను కొద్దిరోజులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సంగమేశ్వరం దగ్గర పనులు చేసే వాహనాలను సైతం తరలించారంటున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు, ఏటేటా తరలించుకుపోతున్న లెక్కలతో నిలదీసేందుకు మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా సిద్ధమవుతున్నారు.

ప్రాజెక్టుల దగ్గర భద్రత

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో పలు ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. నాగార్జున సాగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పులిచింతల వద్ద కూడా సెక్యూరిటీ పెంచారు. మరోవైపు నాగార్జున సాగర్, పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నాగార్జున సాగర్ జలవిద్యుత్, ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్‌తో పాటు అదనంగా ప్రత్యేక భద్రతా దళాలతో భద్రత ఏర్పాటు చేశారు. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సాగర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story