ఏపీ కంటే తెలంగాణే బెస్టంట.. ఎందులో ?

by Anukaran |
ఏపీ కంటే తెలంగాణే బెస్టంట.. ఎందులో ?
X

దిశ, న్యూస్ బ్యూరో : కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సాగర్‌కు తరలిస్తున్నారని ఏపీ చేసిన ఫిర్యాదుల్లో పస లేదని తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ శ్రీశైలం జల విద్యుత్ ఉత్తత్పి అంశంలో ముందు నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉంది. కృష్ణా బోర్డుకు వరుసగా లేఖలు రాసింది. లేఖ రావడమే తరువాయి బోర్డు కూడా ఆగమేఘాల మీద స్పందించింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని నిలిపివేయాలని లేఖలు పంపించింది. దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయమే కరెక్ట్ అని ఇటీవల కేంద్రం రాసిన లేఖతో వెల్లడైంది. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు అని, వరద వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని, దీనిద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరందించవచ్చని బచావత్ ట్రిబ్యునల్‌‌లో సూచించిన అంశాలను సీఎం కేసీఆర్ సైతం వెల్లడించారు. దీని ప్రకారమే కేంద్రం కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంపై ఎలాంటి అభిప్రాయాన్ని పేర్కొనలేదు. అటు కేంద్రానికి, జల సంఘానికి, కృష్ణా బోర్డుకు లేఖలు రాసిన ఏపీకి ఈ పరిణామాలు చుక్కెదురైనట్లుగా భావిస్తున్నారు.

పోతిరెడ్డిపాడుకు నీళ్లందడం లేదనే…!

ఈసారి ఏపీ తెలంగాణపై అక్కసు పెంచుకుంది. ప్రధానంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు వరద మొదలైనప్పటి నుంచే ఏపీ ప్రయోగాలు మొదలుపెట్టేది. పోతిరెడ్డిపాడు ద్వారా లీకేజీల రూపంలోనే నాలుగైదు వేల క్యూసెక్కులను తీసుకునేది. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్యం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరే సమయంలోనే ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. 38 వేల నుంచి 43 వేల క్యూసెక్కులను విద్యుత్ కోసం వినియోగిస్తూ సాగర్‌కు వదిలింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుననుసరించే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించింది. ట్రిబ్యునల్‌లో సూచించిన విధంగానే పవర్ జనరేషన్ కొనసాగించారు. దీంతో దిగువకు నీరు విడుదల అవుతుండటంతో పోతిరెడ్డిపాడుకు నీరందలేదు. గతంలో వరుసగా నాలుగేండ్లు పరిశీలిస్తే వరదలు వచ్చిన ఈ సమయాల్లో పోతిరెడ్డిపాడు నుంచి దాదాపు 30 టీఎంసీలకుపైగా నీటిని తరలించేవారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసుకున్నాఅధికారికంగా మాత్రం వెల్లడించని ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంటోంది. కానీ ఈసారి అవకాశం లేకుండా పోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవో జారీ చేసి, టెండర్లు పిలిచిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు జల వివాదాలు మొదలైన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని నిరంతరాయంగా కొనసాగించినట్లు నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

బోర్డుకు స్పీడెందుకో..?

పలు అంశాల్లో ఏపీ వైఖరిని నిలదీస్తున్న తెలంగాణకు బోర్డు ప్రతిసారి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఏపీ ఫిర్యాదులు, లేఖలపై హడావుడి చేసే కృష్ణా బోర్డు… తెలంగాణ తరపున వేలెత్తి చూపించే జల దోపిడీపై ఏపీకే వత్తాసుగా నిలుస్తోంది. తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఏపీకి చాలా అధికారికంగా.. చాలా ఆలస్యంగా చేరవేస్తుందనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గతంలో పోతిరెడ్డిపాడు అంశంలో పట్టింపులేకుండా వ్యవహరించే బోర్డు ఈసారి మాత్రం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళన చెందినట్లుగా వ్యవహరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖల్లో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన అంశాలను పట్టించుకోలేదు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టుగానే పేర్కొన్నారు. కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసినా, లేఖలు రాసినా తెలంగాణ తరపున మద్దతుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, కృష్ణా బోర్డుకు ఈ అంశంలో చుక్కెదురైనట్లుగా భావిస్తున్నాయి.

Advertisement

Next Story