కోతుల కోసం రూ.2.25 కోట్లు

by Aamani |
కోతుల కోసం రూ.2.25 కోట్లు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బుడ్డోడి చేతిలో బిస్కెట్, చాక్లెట్ ప్యాకెటును కోతి లాక్కొని కరిచిందా..? అవ్వ చేతిలో కవరును గుంజేసుకుని వానరం గాయ పరిచిందా..? ఇంటి తలుపు తెరిస్తే చాలు.. సరుకులు, వస్తువులను తీసుకుని ఇల్లంతా గుల్ల చేస్తున్నాయా..? చేలలోని పంటను, కళ్లాలలోని పంట ఉత్పత్తులను తినేస్తున్నాయా..? ఒక్క మాటలో చెప్పాలంటే కోతి చేష్టలతో మీరు విసిగిపోయారా..? ఇకపై మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. కోతుల సంఖ్యను నియంత్రించేందుకు, దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వందలాది కోతులను పట్టుకుని తెచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఇక్కడ పునరావాసం కల్పిస్తున్నారు.

ఇదీ నేప‌థ్యం

నిర్మల్‌ ప్రాంతానికి కోతులతో ఏండ్ల నాటి అనుబంధముంది. చారిత్రాత్మక ప్రాంతం, కోటలు, ఖిల్లలు, బురుజులు, చెరువులు, అడవి ప్రాంతం ఉండడంతో.. ఈ ప్రాంతం కోతులకు ఆవాసమైంది. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరడం, అడవి తగ్గటంతో నివాసం లేక, ఆహారం కరువై జనావాసాల్లోకి వస్తున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో నిర్మల్, పరిసర గ్రామాల్లో కోతుల బెడద పెరిగింది. తెలంగాణ సర్కార్ వచ్చాక ‘మన పట్టణం-మన ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ అశోక్‌తో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ ప్రాంత మేధావులు, నాయకులు, వ్యాపారస్తులతో కలిసి చర్చించగా.. కోతుల బెడద అంశాన్ని లేవనెత్తారు. కోతులు బాగా పెరిగిపోతుండటంతో పంటలకు రక్షణ లేకుండా పోయిందని, మానవ జీవనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మంత్రి అల్లోల అప్ప‌టి పీసీసీఎఫ్‌ పీకే శర్మకు నివేదించారు. ఆయన సర్కారు దృష్టికి తీసుకెళ్లగా.. పైలట్ ‌ప్రాజెక్టుగా ఇక్కడ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని మంజూరు చేసింది.

నిర్మ‌ల్ జిల్లా కేంద్రానికి స‌మీపంలో సారంగాపూర్ మండలం చించోలి (బి) ద‌గ్గ‌ర‌ 150 ఎకరాల అడవిని ఆనుకుని దీనిని ఏర్పాటు చేశారు. దేశంలో హిమ‌చ‌ల్‌ప్రదేశ్‌లో గతంలో ఇలాంటి ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయగా… దేశంలో ఇది రెండోవది. రూ.2.25 కోట్ల నిధులతో దీనిని అట‌వీశాఖ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా అడవులున్న ప్రాంతం. ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో సహజంగానే కోతులెక్కువ. సహ్యాద్రి పర్వతాల మధ్య వెలసిన నిర్మల్‌ చుట్టూ ఎత్తైన గుట్టలు, అటవీ సంపద ఉండటంతో.. వానరాలకు ఆవాసమైంది. దీంతో వానరాలు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి బీభత్సం చేస్తున్నాయి. జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతం ఉండగా.. నిర్మల్ ప‌ట్ట‌ణానికి సమీపంలో చించోలీ(బి) వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటుకు మే 7, 2016లో అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.2.25 కోట్ల నిధులను విడుదల చేయగా.. నవంబరు 20, 2017న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు.

డిసెంబర్ 20న కేంద్రం ప్రారంభం

కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రంలో పశువైద్యాధికారి, ఫార్మాసిస్టు, ఇద్దరు సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆప‌రేష‌న్ థియేట‌ర్, డాక్ట‌ర్స్ రెస్ట్ రూమ్స్, ఇత‌ర‌ పరికరాలను ఏర్పాటు చేశారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. నిర్మల్ పట్టణ పరిసరాల్లో కోతులను అటవీశాఖ వారే పట్టుకొస్తారు. దూర ప్రాంతాల వారు సమాచారం ఇస్తే.. బోనులు ఇస్తారు. గ్రామ పంచాయతీల వారే పట్టుకుని తీసుకు వస్తే.. జీపీ నిధుల నుంచి ఒక్కో కోతికి రూ.500 చొప్పున ఇస్తారు. కోతులను తెచ్చాక రెండు రోజులు ఉంచి.. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. మూడు, నాలుగు రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నాక మ‌ళ్ళీ అడ‌వుల్లో వ‌దిలేస్తారు. ఇప్పటివరకు 324 కోతులను పట్టుకు రాగా.. 286 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడుతున్నారు.

ఒక్కో కోతికి రూ.500 ఇస్తాం – మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

‘ప్రతి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కోతులను పట్టించిన వారికి ఒక్కో కోతికి రూ.500 జీపీ నిధుల నుంచి ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు రూ.2.25 కోట్లతో నిర్మల్‌లో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం. దేశంలో రెండు కేంద్రాలుండగా.. తెలంగాణలో ఏకైక కేంద్రం ఇదే. ఇప్పటికే కోతుల సంతానోత్పత్తి తగ్గించి.. బెడద నుంచి విముక్తి కోసం వాటిని తెచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి.. అడవుల్లో వదిలేస్తున్నారు. భవిష్యత్తులో మూడు, నాలుగు జిల్లాలకో కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

Advertisement

Next Story