ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లు.. ప్రారంభంలోనే సమస్యలు..!

by Anukaran |   ( Updated:2021-06-14 21:45:57.0  )
ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లు.. ప్రారంభంలోనే సమస్యలు..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రాల్లో ఇకపై అన్ని రకాల పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. అందుకు అనుగుణంగా సిబ్బంది, ఏర్పాట్లు చేయకపోవటం సమస్యగా మారింది.. ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఇటీవల ఏర్పాటు చేయగా.. 57 రకాల పరీక్షలు చేయాలని నిర్ణయించారు.. ఈ పరీక్షలు చేసేందుకు అవసరమైన కొత్త సిబ్బంది నియామకం చేయకపోవటంతో.. పలు ప్రాథమిక కేంద్రాల నుంచి డిప్యూటేషన్లపై తీసుకుని సర్దుబాటు చేస్తున్నారు.. మరోవైపు పరీక్షల ఫలితాలు వచ్చేందుకు మూడు రోజులపైనే సమయం పడుతోంది..!

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటీవల అన్ని జిల్లాల్లో స్థానిక మంత్రులు వీటిని ప్రారంభించారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేయగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఉంది. ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో బీపీ, షుగర్, కోలేస్ట్రాల్ ప్రొఫైల్ లాంటి 57రకాల పరీక్షలు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని పీహెచ్‌సీల నుంచి వచ్చే శాంపిళ్లను కూడా ఇక్కడే పరీక్షించనున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల పరీక్షలు చేస్తుండగా.. 57రకాల పరీక్షలకుగాను.. 41రకాల పరీక్షలకే అవసరమైనవి అందుబాటులో ఉన్నాయి. మిగతా పరీక్షల కోసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది.

డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని మాత్రం కొత్తగా నియామకం చేయలేదు. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలల్లో వైద్య శాఖ సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి రప్పించారు. పీహెచ్‌సీ నుంచి డిప్యూటేషనుపై తేవటంతో మండలాల్లో సమస్య మొదలైంది. డయాగ్నోస్టిక్ సెంటరులో మేనేజరుగా మెడికల్ ఆఫీసర్, నోడల్ అధికారిగా వైద్యాధికారి ఉండగా.. మొత్తం 10మంది సిబ్బంది అవసరం. ఇందులో ముగ్గురు మాత్రమే స్థానికులుకాగా.. మిగతా వారంతా డిప్యూటేషను మీద వచ్చిన వారే. మండలాల్లోని పీహెచ్సీల్లోని ల్యాబ్ టెక్నీషియన్లను ఇక్కడికి రప్పించటంతో.. క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. వాస్తవానికి ల్యాబ్ టెక్నీషియన్లు రెగ్యులరుగా పీహెచ్‌సీల్లో వివిధ పరీక్షలు చేస్తుంటారు.

ఇటీవల కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తాజాగా వీరు లేకపోవటంతో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు కరోనా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ల్యాబ్ టెక్నీషియన్లు జిల్లా కేంద్రానికి వెళ్లటంతో.. పీహెచ్‌సీల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటరును ఏర్పాటు చేయగా.. అరకొర సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో 23 పీహెచ్సీల్లోని సిబ్బందిని డిప్యూటేషన్ మీద తీసుకురాగా.. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవటంతో పరీక్షల నివేదికలు జాప్యమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటరుకు అయిదు పీహెచ్‌సీల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్ ఇవ్వగా.. అందులోనూ పరీక్షలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఇతర సిబ్బంది శాంపిళ్లు తీసి.. జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు. మిగతా పీహెచ్‌సీల నుంచి కూడా శాంపిళ్లు సేకరించి.. ఈ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed