డబుల్ బెడ్రూం ఇళ్లకు పైసలివ్వని ప్రభుత్వం

by Anukaran |
డబుల్ బెడ్రూం ఇళ్లకు పైసలివ్వని ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బడ్జెట్ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. బడ్జెట్లో కేటాయించినందుకు నిధులు విడుదల చేయాలన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తుత్తి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ, సంబంధిత శాఖకు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. తాజాగా అర్బన్లో ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలకు రూ. 600 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసినా.. రూపాయి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా అదే తరహా జీవోలు వచ్చాయని, కానీ, నిధులు విడుదల కాలేదని అంటున్నారు.

ఇప్పుడు అప్పుడు అంటూ..

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. మూడేండ్ల నుంచి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పుడు… అప్పుడూ అంటూ లబ్ధిదారులను నిరాశలో పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,72,763 ‘డబుల్’ ఇండ్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు. కానీ, 1.70 లక్షల ఇండ్లను మొదలుపెట్టేందుకే టెండర్లు పిలిచారు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటం, ధరలు పెరగకపోవడంతో టెండర్లు దక్కించుకున్నా కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టిన ప్రాంతాల్లో ఏండ్ల నుంచి నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్ష ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టినా..80 శాతం వరకు పూర్తి చేసి పెండింగ్ పెట్టారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల 540 ఇండ్లను మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందించారు.

నిధుల్లేని ‘భారీ’ బడ్జెట్..

రాష్ట్ర బడ్జెట్లో ‘డబుల్’ ఇండ్లకు భారీగా నిధులిస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఏటేటా వేల కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నా నిధుల విడుదలలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో గృహ నిర్మాణం కోసం రూ. 11,916 కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోనే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తామని లెక్కల్లో చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 9,760 కోట్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు ఇస్తామని చెప్పారు. గృహ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నారు. ఇండ్ల కోసం నిధులు ఇవ్వడం లేదు. గత ఏడాది రూ.9 వేల కోట్లు పెట్టినా.. కేవలం నిర్వహణ కోసం బడ్జెట్ నిధుల నుంచి రూ. 3 కోట్లు మంజూరు చేశారు. పలుమార్లు బీఆర్ఓలు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసినా.. నిధులు మాత్రం శాఖ ఖాతాల్లో జమ చేయలేదు.

తాజాగా అంతే..

ఈసారి బడ్జెట్లో గృహ నిర్మాణం కోసం రూ. 11,916 కోట్లు పెట్టినా.. నిధుల విడుదల మాత్రం చేయడం లేదు. కేవలం కాగితాల్లోనే నిధులు చూపిస్తున్నారు. డబుల్ బెడ్ ఇండ్ల కోసం ఈ విడతలో రూ. 3,850 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో రూ. 150 కోట్లు విడుదల చేస్తున్నట్లు బీఆర్ఓ జారీ చేసింది. కానీ, జనవరి నుంచి నవంబర్ వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో నిర్మాణాలు ముందుకు సాగలేదు. అర్బన్ ప్రాంతాలకు రూ. 3,850 కోట్లు కేటాయించినా అందులో నుంచి నయాపైసా ఇవ్వలేదు. అర్బన్ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ‘డబుల్’ ఇండ్ల నిర్మాణానికి రూ. 600 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘డబుల్’ ఇండ్లకు పెండింగ్ పనుల కోసం ఈ నిధులు సరిపోవు. అయినా గ్రేటర్ ఎన్నికల తాయిలాల్లో భాగంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలు జారీ చేయడంపై అధికారుల్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది. ఎందుకు ఈ జీవోలంటూ పెదవి విరుస్తున్నారు. ఈ జీవోలతో పని లేదని, చెత్తబుట్టలకే పరిమితమంటూ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రూ.150 కోట్లు విడుదల చేస్తున్నట్లు బీఆర్ఓ జారీ చేసినా రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు రూ. 600 కోట్లకు జీవో ఇచ్చినా రూపాయి రాదంటూ చెప్పుతున్నారని, ఆర్థిక శాఖ నుంచి గృహ నిర్మాణ సంస్థ ఖాతాకు అరవై రూపాయలు కూడా రాలేదని వెల్లడించారు.

Advertisement

Next Story