ఈటలను ఢీ కొట్టేందుకు.. రూ. 35 కోట్లు విడుదల..!

by Anukaran |
Eatala Rajende And Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటున్నది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నది. మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు సత్వరం అందిస్తున్నది. అందులో భాగంగా హుజురాబాద్ పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పట్టణంలోని ప్రజల త్రాగునీటి అవసరాల కోసం రూ. 10.52 కోట్లు కూడా ఉన్నాయి. ఇక పట్టణంలోని వివిధ వార్డుల్లోని అభివృద్ధి పనుల కోసం రూ. 25 కోట్లను ఖర్చు పెట్టేలా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి.

పట్టణంలోని అభివృద్ధి పనులను వీలైనంత తొందరగా మొదలుపెట్టి పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఒకటిన్నర నెల రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చూసేందుకు స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించాలని జిల్లా అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

మరోవైపు సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంతకాలం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకెళ్ళినా పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. కొత్తగా అర్హులైనవారికి రేషను కార్డులను అందించడం, వృద్ధులకు సకాలంలో ఆసరా పింఛన్లను అందేలా చూడడం, కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులను పెండ్లి సమయానికి ఇవ్వడం.. ఇలాంటి ఎన్నో అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుండడంతో ఆయనను ఢీకొట్టడానికి ప్రభుత్వం ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

Advertisement

Next Story

Most Viewed