వేల కోట్ల ఆదాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం..!

by Anukaran |
వేల కోట్ల ఆదాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖజానా నింపే క్రమంలో ముందువరుసలో ఉన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదు. లాక్​డౌన్​ తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త గాడిలో పడుతున్న ఈ శాఖ గురించి ఉన్నతాధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపిస్తున్నాయి. రూ.వేల కోట్లు వచ్చే కార్యాలయాలు సర్కార్​ చర్యలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని, హెచ్​ఓడీ నుంచి దిగువ శ్రేణి వరకు ఇన్​చార్జిలతోనే నెట్టుకురావడమే ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఇన్ స్పెక్టర్ ఆఫ్ జనరల్ మొదలుకొని చాలా వరకు సబ్ రిజిస్ట్రార్ల వరకు ఇన్ చార్జీలు, అదనపు బాధ్యతలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తున్నా ఇన్చార్జిల పాలననే సాగిస్తుండడం గమనార్హం.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఇన్ స్పెక్టర్ అండ్ జనరల్ నుంచి చాలా మంది సబ్ రిజిస్ట్రార్ల వరకు అదనపు బాధ్యతలతోనే ఉన్నారు. ఆ శాఖ ప్రధానాధికారి టి.చిరంజీవులును బదిలీ చేశారు. రెగ్యులర్ అధికారిని నియమించలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాస్ ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లో ఓఎస్డీగా చేయిస్తున్నారు. ఆయన రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలను అమలు చేసినా, మరో శాఖలో ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. అదనపు ఇన్ స్పెక్టర్ జనరల్ వెంకట రాజేశ్ ఆరోగ్య సమస్యలతో దీర్ఘ కాలిక సెలవుల్లో వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో 30 వరకు ఇన్ చార్జిలతోనే కాలం వెళ్లదీస్తున్నారని తెలిసింది. ఆయా కార్యాలయాల్లో సీనియర్​ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారితోనే క్రయ విక్రయాలు చేయిస్తున్నారు.

పదోన్నతులు లభించినా

రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులకు ఏడు ఖాళీగానే ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండేళ్ల కిందటే ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లకు డీపీసీ ప్రకారం జిల్లా రిజిస్ట్రార్ గా పదోన్నతి లభించినా, నేటికీ సబ్ రిజిస్ట్రార్లుగానే విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఏటా డీపీసీ నిర్వహించడం రొటీన్ గా జరగాల్సిన ప్రక్రియ. కానీ తెలంగాణలో మాత్రం పదోన్నతి లభించినా ఆ స్థాయి పోస్టింగులు ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రూపు 2 కింద సబ్ రిజిస్ట్రార్లుగా 26 మంది ఎంపికయ్యారు. వారికి డిసెంబరులో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చారు. కానీ పోస్టింగులు మాత్రం ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టులు ఖాళీగా ఉన్నా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఐజీ నుంచి ఉత్తర్వులు జారీ కావడం లేదంటున్నారు.

2020-21 లో ప్రోగ్రెస్ రిపోర్టు
* రిజిస్ట్రేషన్ల సంఖ్య : 6.69,236
* ఆదాయం: రూ.2,716 కోట్లు
* ఈ స్టాంపుల ద్వారా : రూ. 3.147 కోట్లు
* స్లాట్ల బుకింగ్: 1,36,123

Advertisement

Next Story

Most Viewed