శిశు సంరక్షణ కేంద్రాలలోని పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి పొన్నం

by Sumithra |
శిశు సంరక్షణ కేంద్రాలలోని పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి పొన్నం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : శిశు సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు భవిష్యత్తులో విద్య, ఉపాధి పరంగా ఇబ్బందులు కలగకుండా వారికి పలురకాల సర్టిఫికెట్లను అందించి హైదరాబాద్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన శిశు సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు ధ్రువీకరణ (సర్టిఫికెట్లను) పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని 50 (6 ప్రభుత్వ, 44 ప్రైవేట్) శిశు సంరక్షణ కేంద్రాల్లో 2,300 మందికి పైగా పిల్లలు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని శిశుకేంద్రాల్లో సంరక్షణ పొందుతున్న 1330 మందికి పైగా చిన్నారులకు వివిధ రకాల గుర్తింపు , విద్యాపరమైన, కుల, నివాస, ఆధార్ తదితర సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను అభినందించారు.

సర్టిఫికెట్ అందుకున్న వారికి భవిష్యత్ లో అంతా మంచే జరగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఉపాధి ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఇప్పుడున్న 50 శిశు సంరక్షణ కేంద్రాల్లో 6 ప్రభుత్వం నడుపుతుందని, మిగతా వాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడ జరగడం లేదన్నారు . హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మాత్రమే కాకుండా కాస్మోపాలిటన్ సిటీ అని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారన్నారు. శిశు సంరక్షణ కేంద్రాలలో ఉన్న వారికి ఆధారాలు ఉండాలని జిల్లా యంత్రాంగం ప్రతిష్టగా తీసుకుందని తెలిపారు. సర్టిఫికెట్ ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాగా చదువుకోవాలని, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

అనాధ పిల్లల విషయంలో ప్రజాపాలన ప్రభుత్వం మంత్రులు, అధికారులు సానుకూలంగా ఉన్నారని ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శిశు సంరక్షణ కేంద్రాల ఇన్చార్జీలను సన్మానించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 50 శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు చిన్న వయస్సు లోనే ఇబ్బందులు పడకుండా వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు.

వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం హక్కు, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి చిన్నారికి జనన, కుల, ఆధార్, ఆదాయ తదితర 8 రకాల ధ్రువీకరణ పత్రాలను ఇస్తారన్నారు. ఇందుకు జిహెచ్ఎంసీ, రెవెన్యూ, వైద్య, శిశు సంక్షేమ శాఖల సహకారం మరువలేనిదని, వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి శిశు కేంద్రాల్లోని 1330 మంది పిల్లలకు సర్టిఫికెట్లను ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, డీఆర్వో ఈ వెంకటాచారి, కార్పొరేటర్ విజయారెడ్డి , సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శైలజ, యూనిసెఫ్ ప్రతినిధి సోని జార్జ్ రెడ్డి, డిడబ్ల్యూ ఓ అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed