తెలంగాణలో ‘ఒమిక్రాన్’పై హై అలర్ట్.. 2 డోసులు తీసుకున్నా సరే..

by Anukaran |
తెలంగాణలో ‘ఒమిక్రాన్’పై హై అలర్ట్.. 2 డోసులు తీసుకున్నా సరే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త వేరియంట్​‘ఒమిక్రాన్’​కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమైనది. విదేశీ మహమ్మారి రాష్ట్రంలో చొరబడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఎయిర్​పోర్టులో మళ్లీ ఆర్టీపీసీఆర్, క్వారంటైన్​నిబంధనలను తప్పనిసరి చేసింది. నాలుగు ప్రత్యేక బృందాలతో ఎక్కడికక్కడ పరీక్షలు చేయిస్తున్నది. ఒమిక్రాన్​వేరియంట్​విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియాల నుంచి నేరుగా విమానాలు లేనందున, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి స్క్రీనింగ్​ నిర్వహిస్తున్నది.

దీంతో పాటు ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయిస్తున్నది. పాజిటివ్ వచ్చిన వాళ్లను వెంటనే వైద్యసేవల కోసం తరలిస్తున్నది. ప్రైమరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్‌కు పంపటంపై అధికారులు దృష్టి సారించారు. ఆర్టీపీసీఆర్‌లో వైరస్​తేలకపోయినా క్వారంటైన్​చేసి శాంపిల్స్‌ను జీనోమ్​సీక్వెన్సింగ్‌కు పంపుతున్నట్టు హెల్త్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఎంత మందిని స్క్రీనింగ్​చేశారు? ఎందరిలో పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది? జీనోమ్​సీక్వెన్సీకి ఎన్ని శాంపిల్స్​పంపించారు? క్వారంటైన్‌లో ఎంత మంది ఉన్నారు? అనే విషయాలను మాత్రం అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

2 డోసులు తీసుకున్నా సరే..

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు డోసులు తీసుకున్నా 14 రోజుల పాటు క్వారంటైన్ విధిస్తామని అధికారులు తెలిపారు. ఎయిర్​పోర్టుకు రాగానే ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించి క్వారంటైన్​ చేస్తామన్నారు. తర్వాత వారి శాంపిల్స్‌ను జీనోమ్ సిక్వెన్సీకి పంపనున్నారు. పాజిటివ్​తేలిన వారికి ప్రత్యేక ఐసోలేషన్​సెంటర్లలో చికిత్సను అందిస్తామని ఓ అధికారి తెలిపారు.

ఆసుపత్రుల్లో ఏర్పాట్లు పూర్తి..

ఒమిక్రాన్​ రూపంలో థర్ద్​వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వైద్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావుకు సర్కార్ దవాఖాన్లలోని మందులు, మౌలిక వసతులపై అధికారులు ప్రజెంటేషన్​ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖాన్లలో 22,519 ఆక్సిజన్ బెడ్లు, 5,447 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రికి వివరించారు. దీంతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 14 వేల ఆక్సిజన్ బెడ్లు, 9,702 ఐసీయూ, 16 వేల సాధారణ పడకలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ దవాఖాన్లలో 4 వేల ఆక్సిజన్, 2 వేల ఐసీయూ బెడ్లు, ప్రైవేటులో 2 వేల ఆక్సిజన్, 2 వేల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ వద్ద మూడున్నర లక్షల రెమిడెసివర్ ఇంజక్షన్లు, రెండున్నర లక్షల పీపీఈ కిట్లు, 132 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, సుమారు 10 వేల ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్టు స్పష్టం చేశారు. సుమారు మూడు నెలలకు సరిపడా యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్ కిట్లూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కరోనా చికిత్సకు వాడే అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​వైద్యాధికారులకు సూచించారు.

Advertisement

Next Story