అన్‌లిమిటెడ్ @ తెలంగాణ!

by Shyam |   ( Updated:2020-03-03 08:15:36.0  )
అన్‌లిమిటెడ్ @ తెలంగాణ!
X

ప్రభుత్వానికి జరుపుడు అలవాటైంది. ఉద్యోగ సంఘాలేమో ఎక్కడి పాట అక్కడ అందుకోవడంలో రాటుదేలాయి. అసలు బాధితులైన టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు ఏమనుకుంటున్నారు? వారి అంతరంగం ఏమిటి? అనేది చూస్తే ఏ అంశంలోనో ఓ ఐడియా వచ్చింది కదా! యస్.. సరిగ్గా అదే. అందినట్టే అనిపించి, అందనంత దూరమవుతోన్నది ఏదైనా ఉంది అంటే కచ్చితంగా పీఆర్సీనే! ‘రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం’ బోర్డు మాదిరిగా ఎప్పడూ వాయిదానే. ఖజానా వంక చూస్తూ, సాలీనా రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్నందున కాబోలు! ఎంత కాలం జరిపితే తనకు అంత మంచిదని సర్కారు బేఫికరుగా ఉందేమో! ఉబ్బితబ్బిబ్బయ్యే పదం పేరుకు ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్’. తీరేమో అందుకు విరుద్ధం. ఉద్యమ నేపథ్యంతో ఊపిరి పోసుకున్న తెలంగాణను పాలిస్తున్నది మన ఉద్యమ సారథులేనా? అని! ఇది నిష్టురమైన వాక్యమేమీ కాదనీ 2014కి ముందటి రోజులను యాది చేసుకుంటే అనిపించకపోదు. పోరాటకాలంలో నింగీనేలా ఏకమై, ఢిల్లీ మెడలు వంచిన వాటిల్లో.. సిద్దిపేట సభలు, మిలియన్ మార్చ్‌లు, 42రోజుల సకల జనుల సమ్మె, సడక్ బంద్‌లు, సంసద్ యాత్రలు కీలకమైనవి. ఇవన్నీ టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఆర్టీసీ సిబ్బంది భాగస్వామ్యంతో రాజుకున్నవే. సరిగ్గా, ఆ వర్గాలే ఏండ్లుగా దిక్కులు చూడాల్సిన వైచిత్రి.

ముగ్గురు సభ్యుల కమిషనైనా.. రిపోర్టు మగ్గుతూనే ఉన్నదేమీ?
సీఎం బర్త్ డే, సంక్రాంతి, దసరా, ఉగాది వంటి ఫెస్టివల్స్‌, జూన్ 2, పంద్రాగస్టు, చెబ్బీస్ జనవరి లాంటివి ఏమొచ్చినా, మీడియా వంక ఓ కన్నూ, మరో చెవి వేయడం వేతన జీవులకు పరిపాటయింది. పీఆర్సీ న్యూస్ ఏమైనా ఉంటుందా అనేది అసలు ఆశ. అట్లా కేలండరులే మారాయి. సెంట్రల్‌లో పదేండ్లకు, స్టేట్‌లో ఐదేండ్లకు ఓసారి జీతాలను పెంచుతుంటారు. అందుకు వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) వేస్తారు. పొత్తుల రాష్ట్రంలో 1958 నుంచి లెక్క ప్రకారమైతే 12 పీఆర్సీలు వేయాలి. కానీ, ఉమ్మడి పాలకులు తొండి పెట్టి, 10కే పరిమితం చేశారు. ఆ విధంగా 120 మాసాలకు ఉద్యోగులను నష్టపరిచారు. రాష్ట్రం వచ్చాక చూస్తే, ప్రస్తుతమున్న పీఆర్సీ ఫస్ట్‌ది. ఉమ్మడితో చూస్తే, 11వది. 2014లో విభజన జరగకముందటి పీఆర్సీ రిపోర్టును సీఎం కేసీఆర్ 2015 ఫిబ్రవరి 5‌న ఆమోదించి ఏకంగా 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. 2018 జులై 1తో పదో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) వ్యవధి తీరింది. ఉద్యమ సాహచర్యం, వాస్తవిక అవగాహన, ప్రేమానురాగాలతో సీఎం కేసీఆర్ నాడు ఆ గడువుకు ముందే తొలి పీఆర్సీని అదే ఏడాది మే 15న, రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ ఛైర్మన్‌గా, ఇంకో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు ఉమామహేశ్వర్ రావు, మహ్మద్ అలీ రఫత్‌ మెంబర్లుగా వేశారు. ఒకరితోనే ఉండే పీఆర్సీని ఇట్లా ముగ్గురితో వేయడం అదే ప్రథమం. తద్వారా స్పీడుగా రిపోర్టు వస్తుందన్నది సంకల్పం. అందుకే అదే ఏడాది జూన్ 2న ఐఆర్ (మధ్యంతర భృతి), ఆగస్టులో ఫిట్మెంట్‌ ఇస్తామని కేసీఆర్ మాటిచ్చారు. త్రిమెన్ కమిటీ అయినా, రిపోర్టు మాత్రం మగ్గుతూనే ఉన్నది. టోటల్ పీఆర్సీల చరిత్రలో ఎక్కువ టైం పట్టింది 1993నాటి 6వ పీఆర్సీలో 23 నెలలలు. ఆ రికార్డును బద్ధలు కొట్టేలా ఈ పెద్ద కమిటీ నివేదిక లేటవడం విస్మయపరుస్తొంది.

ఆర్టీసీ అనుభవం..లోలోపల ఆగ్రహం
ఉద్యోగులు ఉసూరు‌మనేలా పీఆర్సీ గడువు ఫిబ్రవరి 24తో ముగిసే ముందు డిసెంబరు 31 దాకా పొడిగించారు. ఆ జీవో 447ని సీఎస్ సోమేశ్ కుమార్ గతనెల 18న జారీ చేశారు. దీనిపై ఉద్యోగులు ప్రొటెస్టు చేయడంతో.. ఫిబ్రవరిలోనే రిపోర్టు వస్తుందని ఊరడించారు. తీరా ఇపుడు ఫిబ్రవరీ గడిచింది. మార్చి 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకూ రెడీ అవుతున్నారు. అన్ లిమిటెడ్ కాలయాపనపై వేతన జీవులు లోలోపల రగిలిపోతున్నారు. ఉద్యోగ సంఘాల పనితీరు పేలవంగా ఉన్నదనీ నారాజ్ అవుతున్నారు. ఆర్టీసీ సమ్మె టైంలో సర్కారు వైఖరి వారి మదిలో నాటుకుపోయింది. మొన్నటికి మొన్న నల్గొండ, వికారాబాద్‌లో లొల్లికి దిగారు. పన్నుల రూపంలో గరిష్టంగా 30 శాతం తిరిగి సర్కారుకే చెల్లించే తమనిలా మనస్తాపం పాలు చేయడం ఏంటని వాపోతున్నారు. పైగా ‘ఎంతో కొంత ఇచ్చుకుంటం’ అని సీఎం అన్నారంటే, అది యూనియన్ నేతల బలహీనతేనని కామెంట్ చేస్తున్నారు. సర్కారు తెలివిగా తమను జనం దృష్టిలో దుష్మన్‌గా చేస్తున్నదనీ అనలైజ్ చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి పేస్కేళ్ళున్నాయని పేర్కొంటున్నారు.

కొసమెరుపు
పీఆర్సీని పదే పదే లేటు చేయడమంటే ఉద్యోగులపై కక్ష సాధించడమేనని మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇక్కడ సందర్భోచితం. ఒక యాంగిల్‌లో చూస్తే, 2018 డిసెంబరులో అసెంబ్లీ ముందస్తు ఎలక్షన్లు, ఆ తర్వాత లోక్‌సభకు పోరు, మధ్యలో మండలి ఎన్నికల కాలంలో ప్రభుత్వానికి, వేతన జీవులకు మధ్య అంతరం పెరిగింది. అది గ్రహించే ఏమో! హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపుడు ఉద్యోగ నేతలతో సీఎం లంచ్ మీటింగ్ పెట్టారు. పీఆర్సీపై కలుద్దామంటూ మరోసారి ఊరించారు. ఆ భేటీ మాత్రం ఇంతవరకూ జరగలేదు. అంతేకాదు, 2019 నవంబరు 10న సీఎంవో ఒక ప్రకటన చేసింది. 12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు దాని సారాంశం. కాగా, పీఆర్సీ వ్యవహారంపై వేర్వేరు శాఖల ఉద్యోగులు, టీచర్లు కొందరిని ‘దిశ’ ప్రత్యేక ప్రతినిధి కదిపారు. పారదర్శకంగా, నమ్మకమైన విధానాన్ని అనుసరించాల్సిందని ఒక రిటైర్డు మాస్టారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో నిరాశ, నిస్పృహలకు పాలకుడి వైఖరే కారణమన్నారు. అయితే, మరో యువ ఉపాధ్యాయుడు భిన్నంగా ఆసక్తిగొల్పేలా రియాక్టయ్యారు. ‘నేను ఇటీవలే మిడ్ మానేరు చూశాను. కడుపు నిండింది. జీవితంలో కండ్ల చూస్తామనుకోని నీటిని చూశాను. తెలంగాణ సస్యశ్యామలానికి అది ఇండికేషన్. కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కచ్చితంగా మెచ్చుకోవాలి. నిధులన్నీ దానికే వెచ్చించారు కావొచ్చు. మాకు పీఆర్సీ లేటయితే కొంపలు మునిగేదేమీ లేదు. ఇంకా కొన్నాళ్లు పడితే పట్టనీ. వేతన జీవులుగా మేం బతకలేమా? కేసీఆర్ తీరుపై నేనూ ఎంతో కోపంగా ఉన్నోడినే. కానీ, కాళేశ్వరం రిజల్టు చూశాక మనసు మారింది..’ అని ఆ టీచర్ స్పందించారు.

Advertisement

Next Story