భువనగిరి ఖిల్లాపై మరో సాహసం

by Anukaran |
భువనగిరి ఖిల్లాపై మరో సాహసం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: భువనగిరి కోట సాహస క్రీడలకు వేదికవుతోంది. ఇప్పటికే ట్రెక్కింగ్‌తో దేశవ్యాప్త గుర్తింపు పొందిన భువనగిరి కోటపై మరో సాహస క్రీడకు నాంది పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భువనగిరి ఖిల్లాపై ట్రెక్కింగ్ శిక్షణ దూసుకెళ్తుండగా, మరో అడ్వెంచర్ గేమ్‌గా పిలిచే జిప్‌లైన్ సాహస క్రీడను నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించిన పనులను ఇటీవలే మొదలుపెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన హామీలనే.. నేటికీ అమలు చేయలేకపోయింది. తాజాగా జిప్‌లైన్ గేమ్ అంటూ మరో కొత్త స్వరాన్ని అందుకుంది. నిజానికి క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ఇలాంటి ఏర్పాట్లు అవసరమే. కానీ వాటిల్లో రాణించేందుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలోనూ అదే చిత్తశుద్ధి ఉండాలనేది అక్షర సత్యం. రాష్ట్ర ప్రభుత్వం భువనగిరి కోట అభివృద్ది కోసం రూ.100 కోట్లతో బృహత్తర ప్రణాళికను చేపట్టింది. కానీ ఆ ప్రణాళిక ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడైనా జిప్‌లైన్ సాహస క్రీడకు సంబంధించి పనులు పూర్తి చేస్తుందా? అసంపూర్తిగానే వదిలేస్తుందా?.. అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.

200 అడుగుల పొడవుతో జిప్‌లైన్..

భువనగిరి కోటపై ఇప్పటికే భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ పేరుతో ఓ ప్రైవేటు శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్ (తాడు సాయంతో కొండ పైకి ఎక్కడం), ర్యాప్లింగ్ (తాడు సాయంతో కొండపై నుంచి కిందకు దిగడం)వంటి అంశాల్లో శిక్షణ ఇస్తోంది. తాజాగా జిప్​లైన్ సాహస క్రీడకు భువనగిరి కోట వేదికకానుంది. జిప్​లైన్ సాహస క్రీడ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అహ్మదాబాద్​కు చెందిన నీరట్​కుమార్ భట్ బృందం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించింది. ప్రస్తుతం పర్వతారోహణ జరుగుతున్న ప్రాంతంలో కోటకు ఇరువైపులా ఎత్తైన రాళ్లను తీగతో అనుసంధానం చేసి జిప్​లైన్ అనే సాహస క్రీడ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇకపై రాక్ క్లైంబింగ్​తో పాటు జిప్ లైన్ అనే సాహస క్రీడలోనూ పాల్గొనేందుకు పర్యటకులకు అవకాశం కలగనుంది. ఇదిలావుంటే… ఇప్పటికే జిప్ లైన్ 200 అడుగుల పొడవుతో నిర్మాణం మొదలైంది. జిప్ లైన్ నిర్మాణానికి రెండు వైపులా బండరాళ్లను లోతుగా తొలిచి తీగ బిగిస్తారు. రెండింటి మధ్య సుమారు 200 అడుగుల దూరం ఉంటుంది. తీగకు ఏర్పాటు చేసిన కదిలే పుల్లీకి క్లాంప్ బిగించి, వ్యక్తి కూర్చునేందుకు తొట్టి లాంటి బెల్టులను ఏర్పాటు చేశారు. దీన్ని తొడుక్కొని జిప్ లైన్​పై వెళ్లాల్సి ఉంటుంది. రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఉండి పర్యాటకులను పంపించి తిరిగి దింపుతారు. దీని నియంత్రణ తాడు.. ఇద్దరు నిర్వాహకుల వద్ద ఉంటుంది.

రాక్ క్లైంబింగ్ సీన్ రిపిట్ అయ్యేనా..

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహించేందుకు శిక్షణ తీసుకునేందుకు భువనగిరి కోట ఎంతో అనుకూలం. దీనికితోడు రాజధాని నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పర్వతారోహకుల చూపు భువనగిరి కోటపై పడింది. దీంతో రాక్‌క్లైంబింగ్ స్కూల్‌ను 2013 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. అయితే అనంతరం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టాన్సెండ్ అడ్వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తోంది. భువనగిరి కోటపై శిక్షణ పొందిన 400 మందికి పైగా సాహసికులు ప్రపంచ శిఖరాలను అధిరోహించారు. తెలంగాణకు చెందిన మాలవత్ పూర్ణ సైతం ఇక్కడ శిక్షణ పొందినవారే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పర్వతారోహకులు శిక్షణ తీసుకునేందుకు కనీస వసతులు లేకుండాపోయాయి. వాస్తవానికి భువనగిరి కోట పర్వతారోహకులకు చాలా అనుకూలం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది రాక్‌క్లైంబింగ్‌ను సద్వినియోగం చేసుకోలేకపోతుండడం గమనార్హం. ఇప్పటికైనా భువనగిరి కోటపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed