- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ వయసుపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి
దిశ, న్యూస్‌బ్యూరో: క్రిందిస్థాయి ఉద్యోగుల్లో ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు నడుం బిగించారు. ఉద్యోగులందరికీ వర్తించే డిమాండ్లపై స్వరం పెంచుతున్నారు. ఉద్యోగుల నుంచి ఉవ్వెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ డిమాండ్లను తెరపైకి తెచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే వ్యూహానికి పదును పెడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించేలా సంఘం అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సత్యనారాయణ చొరవ తీసుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచుతామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. వరుసగా మూడు నెలల పాటు సగం జీతం మాత్రమే ఇచ్చినందున మిగిలిన సగం జీతం (మూడు నెలలదీ)ను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల పూర్తి జీతం ఇవ్వాలని కూడా తీర్మానం చేసింది. గ్రూప్-1 ఉద్యోగ పోస్టుల్ని భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించాలని, అసరాన్నిబట్టి గెజిటెడ్ అధికారుల సంఘం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తుందని తీర్మానం చేసింది.
దాదాపు రెండేళ్ళుగా పెండింగ్‌లోనే ఉన్న వేతన సవరణ (పీఆర్సీ)పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని సత్వరం తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేసిన అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాన్ని మంజూరు చేయాలని, పదోన్నతి పొందడానికి ప్రస్తుతం ఉన్న మూడేళ్ళ కాలాన్ని రెండేళ్ళకు తగ్గిస్తూ జీవో వెలువరించాలని తదితర మొత్తం ఎనిమిది తీర్మానాలను గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం ఆమోదించింది. గ్రూప్-1 అధికారుల సంఘం ఈ తీర్మానాలకు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో గెజిటెడ్ అధికారుల సంఘం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని, ఆ సంఘంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గెజిటెట్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తన భర్తకు పదవీ విరమణ అనంతరం పొడిగింపు కోసం చేసిన ప్రయత్నాలపై ఈ సమావేశం ఎలాంటి తీర్మానాన్ని చేయలేదు. సంఘం నాయకురాలి హోదాలో వ్యక్తిగత లబ్ధి చేకూరేలా వ్యవహరించడంపై భారీ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వచ్చినా సమావేశంలో మాత్రం దానికి సంబంధించి ఎలాంటి తీర్మానం జరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యోగుల అసంతృప్తి ఏ సమయంలో ఎలా బద్దలవుతుందో ఊహకు అందడంలేదు. అసలే పీఆర్సీ, ఐఆర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు, సగం జీతం లాంటి అసంతృప్తి ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కార్యకవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి తీర్మానాల్లో వాటిని ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.