యాసంగి రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా?

by Anukaran |   ( Updated:2020-11-30 03:25:38.0  )
యాసంగి రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా?
X

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాల కారణంగా సర్వం కోల్పోయి, ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతన్నకు ‘యాసంగి’ పంట గుబులు రేపుతోంది. ఇన్నిరోజులు కష్టపడి పండించిన పంట కల్లాల్లో కాంటాకు ఎదురుచూస్తుండగా.. మరోవైపు పెట్టుబడి సాయం ఆందోళన కలిగిస్తోంది. అప్పుతెచ్చి ‘అరక’ పడుదామంటే ధాన్యం డబ్బులు ఎప్పడొస్తాయో తెలియక, అటు రైతుబంధు సాయంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాక రైతు గుండె బరువెక్కుతోంది. అయినా.. ఎప్పట్లాగే ‘సాలు’ పడదామని సర్దుకొంటుండగా ఎన్నికలు వచ్చి ఎవు‘సాయా’న్ని వెనక్కి నెట్టడంతో అన్నదాత హరి ‘గోస’ పడుతున్నడు. కరోనా కాటుతో అప్పులు పుట్టక, బ్యాంకులు లోన్లు ఇయ్యక.. కాలం నెత్తి మీదికొచ్చి రైతులు కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నరు.

2018 మే 10న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎకరానికి ఏడాదికి రూ.8వేల సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఆ ఏడాదే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.10వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. 2019లో వానకాలం పంటకు రైతుల ఖాతాల్లో ఎన్నికల హామీని నెరవేరుస్తూ నగదు జమ చేశారు. కానీ అదే ఏడాది యాసంగిలో మాత్రం కొంతమందికే సాయాన్ని అందజేశారన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ 2020వానకాలం పంటకు కరోనా మహమ్మారి అడ్డం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో రెండు నెలలు కోతలు విధించి.. చివరి రైతు వరకు అకౌంట్లలో నగదు జమ చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

(ధరణి ట్రయల్ రన్)

కానీ రైతుబంధు పథకం ప్రారంభం సమయంలో వానకాలం పంట సాయాన్ని మే 15వరకు, యాసంగి పంట డబ్బులు నవంబర్‌లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ఈఏడాది నవంబర్ నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకూ రైతులకు సాయం అందించకపోగా.. హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. సీఎం చెప్పినట్టు సన్నవడ్లు పెట్టినా పండిన ధాన్యాన్ని కాంటా వేసేందుకు రోజుల తరబడి సమయం పడుతుండటంతో రైతన్న ఆగ్రహానికి గురి కావల్సివస్తోంది. అటు.. పండిన ధాన్యం కొనుగోలులో జాప్యం, ఇటు రైతుబంధు డబ్బులు సకాలంలో పడకపోవడంతో యాసంగి పంటను ఎలా మొదలు పెట్టాలని రైతులు మదనపడిపోతున్నారు.

ఈ ఏడాది వానకాలం పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని జూన్ చివరివారంలో ఒకేసారి 50.84లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఆ తర్వాత ఇంకెవరికైనా డబ్బులు రాకుంటే వివరాలు నమోదు చేసుకుంటే చివరి రైతు వరకు ఇస్తామని భరోసా కల్పించింది. కానీ ప్రస్తుత యాసంగి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలియక, అసలు దానిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా పట్నంలో గ్రేటర్ ఎన్నికల హడావుడిలో ఉండి పల్లెల్లో ఉన్న రైతులను పట్టించుకోకపోవడంతో.. అసలు ఈసారి రైతుబంధు అందుతుందా లేక ఎగనామం పెడుతారా అన్న బెంగతో రైతన్న కలవరపాటుకు గురవుతున్నడు.

Advertisement

Next Story