అధికారులు అప్రమత్తంగా ఉండండి : డీజీపీ

by Shyam |   ( Updated:2020-08-16 11:48:41.0  )
అధికారులు అప్రమత్తంగా ఉండండి : డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వైజాగ్, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే. ఉత్తర కోస్తాను అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గ్యాంగ్‌టక్ ప్రాంతాల్లో అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. బంగాళాఖాతంలో సుమారు ఆగస్ట్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపీ లేకుండా వానలు పడుతుండటంతో డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం కీలక ఆదేశాలు జారీచేశారు. వర్షాల వలన ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేసి, డీజీపీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. గత రెండ్రోజులుగా సీఎస్ సోమేశ్ కుమార్, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని తగు సూచనలు, సలహాలను ఇస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలలో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు . ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story