400 మార్కు దాటిన కరోనా కేసులు

by vinod kumar |
400 మార్కు దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 404కు చేరుకున్నాయి. మంగళవారంనాడు కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. పదకొండు మంది చనిపోవడం, 45 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నా సగం జంటనగరాల పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిజామాబాద్‌లో అత్యధికంగా 36 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ అధికారుల అంచనాలకు అందకుండా గద్వాల జిల్లాలో 22 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం ఎనిమిది జిల్లాల్లో మాత్రమే కరోనా వైరస్ బాధ లేదు. మిగిలిన 25 జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం ఉంది.

రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైన గచ్చిబౌలి స్టేడియంను వీలైనంత త్వరగా ఆసుపత్రిగా మార్చి ఐసొలేషన్ వార్డులను, ఐసీయూ వార్డులను పనిచేయించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ మంగళవారం పర్యటించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఒకటి, రెండు రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులను కూడా దాతల నుంచి సేకరిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్ మేరకు త్వరలో రాష్ట్రానికి అందుతాయని మంత్రులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో సుమారు 1,500 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీనికి అదనంగా రాష్ట్రంలోని 22 ప్రైవేటు మెడికల్ కళాశాలలకు చెందిన ఆసుపత్రుల్లో మరో 1200 బెడ్‌లను కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Tags: Telangana, Corona, Gachibowli Stadium, Positive cases,

Advertisement

Next Story

Most Viewed