బడ్జెట్లలో అంచనాలెక్కువ.. ఖర్చు తక్కువ

by Shyam |   ( Updated:2020-03-11 06:56:43.0  )
బడ్జెట్లలో అంచనాలెక్కువ.. ఖర్చు తక్కువ
X

దిశ, న్యూస్ బ్యూరో:

తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా ఆర్థిక నిర్వహణలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి బడ్జెట్ సైజుకు చేరుకుందని ఒకింత గర్వంగా ప్రకటించుకుంటుంది. మరే రాష్ట్రంలో కనిపించనంత వేగంగా ఆర్థిక వృద్ధి జరుగుతోందంటూ సంబురపడుతుంది. ఏటేటా బడ్జెట్ సైజు పెరుగుతూ ఉంటుంది. అందులో సంక్షేమ పథకాలకు భారీస్థాయిలో నిధుల్ని విడుదల చేశామంటూ ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేల వరకు ఒకరికి మరొకరు కితాబులిచ్చుకుంటారు. కానీ, వాస్తవానికి బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు నిధుల విడుదల జరిగిందో లేదో తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆరేళ్ళ తెలంగాణ బడ్జెట్‌లు అవే స్పష్టం చేస్తున్నాయి. బడ్జెట్‌లో వేసుకున్న ఖర్చు అంచనాలకు, వాస్తవికతకు భారీస్థాయిలో వ్యత్యాసం ఉంటోంది. కానీ, ప్రభుత్వం మాత్రం బడ్జెట్ సైజును చూపించి కావాల్సినంత ప్రజాదరణను, పబ్లిసిటీని పొందుతోంది. వాస్తవ ఖర్చులు మాత్రం ఎప్పుడూ తెరవెనకగానే ఉండిపోతున్నాయి. అంచనాలను, వాస్తవికతను పోల్చి చూస్తే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎలాంటిదో బైటపడుతుంది. తెలంగాణలో ఇది కొట్టొచ్చినట్లుగా తేటతెల్లమవుతుంది.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పటికి ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో అయిదింటికి వాస్తవంగా ఖర్చయిన నిధుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వీటిని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) కూడా ఆడిటింగ్ చేసింది. ప్రభుత్వానికి కూడా సమర్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ బడ్జెట్ లెక్కలను పరిశీలిస్తే ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో రూ.లక్ష కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించగా అందులో కేవలం రూ.62 వేల కోట్లే ఖర్చయినట్లు తేలింది. కాగ్ నివేదిక ఈ వివరాలను బైటపెట్టింది. 2016-17 బడ్జెట్ సందర్భంగా 2014-15 బడ్జెట్‌ ఆడిట్ చేసిన వాస్తవిక లెక్కలు వెలుగులోకి వచ్చాయి. అంటే బడ్జెట్‌‌లో చెప్పిన అంచనా వ్యయానికీ, ఆ ఏడాది చేసిన వాస్తవిక వ్యయానికీ మధ్య 38 శాతం తేడా ఉంది. కానీ, రూ.లక్ష కోట్లతో తెలంగాణ బడ్జెట్ అంట.. అనే ప్రచారం మాత్రం ప్రభుత్వానికి కావాల్సినంత వచ్చింది. అందులో చేసిన రాజకీయ కేటాయింపులకు కావాల్సిన ప్రయోజనమూ చేకూరింది.

ఇక ఆ తర్వాతి ఏడాది 2015-16లో రూ. లక్షా 15 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆ ఏడాది అసలు ఖర్చైన నిధులు రూ.98 వేల కోట్లు మాత్రమే. అంటే రెండో ఏడాది రూ. 17 వేల కోట్ల తేడాతో తక్కువ స్థాయిలోనే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.‌ లక్షా 31 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈ ఏడాది మాత్రం రెండున్నర వేల కోట్లు ఎక్కువగా (లక్షా 33 వేల కోట్లు) ఖర్చయింది. ఇక నాలుగో బడ్జెట్ అయిన 2017-18లో రూ. లక్షా 47 వేల కోట్ల బడ్జెట్ వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా ఆ ఏడాది రూ.3 వేల కోట్లు తక్కువగా నిధులను ఖర్చు పెట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.లక్షా 74 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆ ఏడాది కూడా రూ.17 వేల కోట్లు తక్కువగా కేవలం రూ.లక్షా 57 వేలకోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఈ లెక్కలను మొన్న ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ సందర్భంగా 2018-19 అకౌంట్స్ పేరుతో 2 సంవత్సరాల తర్వాత వెల్లడించింది.

ఇక తాజా బడ్జెట్‌లోని అంశాలనే పరిశీలిస్తే… గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్‌లో రూ.1.46 లక్షల కోట్ల ఖర్చును ప్రభుత్వం చూపించింది. కానీ, సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు మాత్రం రూ. 1.42 లక్షల కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. అంటే, రూ.4,000 కోట్ల మేర తగ్గింది. వాస్తవిక లెక్కలను విశ్లేషిస్తే ఈ తేడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. వివరాలను మరింత లోతుగా పరిశీలిస్తే… గత బడ్జెట్‌లో ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకానికి రూ. 6,000 కోట్లు కేటాయించింది. కానీ, ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం చూస్తే విడుదలైంది రూ. 9968.13 కోట్లు మాత్రమే. ఇలాంటి తేడాల వివరాలన్నీ కాగ్ నివేదికలో బహిర్గతమవుతాయి.

బడ్జెట్ అంచనాలకు, వాస్తవిక లెక్కలకు ఎంతో కొంత తేడా ఉండడం సహజం. కానీ, అంచనాకు అందని తీరులో తేడా ఉండడమే ఇక్కడ చర్చనీయాంశం. ఆర్థిక నిర్వహణ సమర్ధతకు బడ్జెట్ అంచనా, వాస్తవిక వ్యయం అద్దం పడుతుంది. ఇలా బడ్జెట్ అంచనాలు ప్రవేశపెట్టినప్పుడల్లా అంచనాలకు, వాస్తవిక ఖర్చుకు తేడాలుంటున్నాయి. రాజకీయ పార్టీలకు మాత్రం ఆయా స్కీంలకు ఎంతో నిధులు కేటాయించిన క్రెడిట్ మాత్రం దక్కుతోంది. వాటి రాజకీయ ప్రయోజనాలూ నెరవేరుతున్నాయి. ఇలా బడ్జెట్‌లు ప్రతి ఏడాది పెరగడం వెనుక ఆర్థిక వృద్ధి కారణమని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటుంటాయి. తాము చేసిన పరిపాలన వల్ల జీఎస్‌డీపీ పెరిగి అందుకు తగ్గట్టుగా పన్నువసూళ్లు పెరిగి బడ్జెట్‌ల సైజు పెద్దదవుతోందని రాజకీయ నాయకులు గర్వంగా చెబుతుంటారు. కానీ, వాస్తవంగా ఎంత ఖర్చయిందీ మాత్రం రెండేళ్ళ తర్వాతనే వెలుగులోకి వస్తుంది. వాస్తవిక ఖర్చు తగ్గుతున్నదంటే బడ్జెట్ రోజు చెప్పిన నిధులు ఆయా స్కీంలకు ఖర్చుకాలేదనే అర్థంచేసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తల అభిప్రాయం.

ఇలా బడ్జెట్‌ల నిండా అసలు అభివృద్ధి, సంక్షేమం కంటే రాజకీయాలే ఎక్కువ పాళ్లలో ఉంటున్నాయి. తెలంగాణ విషయంలో గత ఏడాది బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఇవ్వని రుణమాఫీ, నిరుద్యోగభృతి లాంటి స్కీంలు కూడా ఈ కోవలోకే వస్తాయి. బడ్జెట్ సమర్పించే సమయానికి నిరుద్యోగ భృతికి ఇన్ని కోట్లు కేటాయించాం, రుణమాఫీకి ఇన్ని కోట్లు కేటాయించాం అని ప్రభుత్వమూ, అధికార పార్టీ నేతలు గొప్పగా క్లెయిమ్ చేసుకుంటుంటాయి. కానీ, పన్నెండు నెలలు గడిచినా వాటికి ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చదు. ఈ పన్నెండు నెలల వ్యవధిలో ప్రజలు ఈ వాస్తవంవైపు దృష్టి పెట్టరు. కొత్త బడ్జెట్‌లో మళ్ళీ ఇలాంటి కొన్ని వరాలు కనిపిస్తాయి. వాస్తవం మాత్రం ఎప్పటికీ అంధకారంలోనే ఉండిపోతుంది. ఆ తరహాలోనే ఈ ఏడాది బడ్జెట్‌లోనూ చాలా స్కీంలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎంత వరకు నిధులు విడుదలై అమలవుతాయన్నది వచ్చే బడ్జెట్ నాటికి కొంత స్పష్టత వస్తుంది. రెండేళ్ళ తర్వాత ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతుంది.

బడ్జెట్ రోజు ప్రభుత్వం చెప్పేవి కేవలం రాబోయే ఆర్థిక సంవత్సంలో ఆయా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం, పథకాలకు అయ్యే ఖర్చు వివరాలు మాత్రమే. ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌ను ఈ నెల 9వ తేదీన ప్రవేశపెట్టింది. రూ.లక్షా 81 వేల కోట్లతో బడ్జెట్ రూపుదిద్దుకుంది. దీనర్థం ఆ డబ్బులు కచ్చితంగా ఖజానాలోకి వచ్చిపడి ప్రభుత్వాలు ఖర్చుచేస్తాయని కాదు. అవి కేవలం అంచనాలు మాత్రమే. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అవసరాలు, సమకూరే ఆదాయం తదితరాలను బేరీజు వేసుకుని ఒక పకడ్బందీ వ్యూహం రూపొందించడం బడ్జెట్ లక్ష్యంగా ఉంటుంది. ఈ అంచనాల్లో ఏ స్థాయిలో తేడా ఉంటే ఆ మేరకు ఆర్థిక నిర్వహణపై ఆ ప్రభుత్వ సమర్ధత ఎంతో తేలిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఏడు బడ్జెట్‌లు, అందులో పేర్కొన్న అంచనా వ్యయం, ఐదు ఆర్థిక సంవత్సరాల్లో చేసిన వాస్తవిక వ్యయం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలోని సమర్ధత ఎంతో అర్థమైపోతుంది.

రెండేళ్ళ కాలం తర్వాత ప్రభుత్వం వాస్తవికంగా ఎంత ఖర్చు చేసిందీ తెలిసిపోతుంది. తాజాగా ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌లో చెప్పిన నిధుల కేటాయింపు, అసలు ఖర్చుల వివరాలు మరో రెండేళ్ళ తర్వాత వెలుగులోకి వస్తాయి. నిజంగా ఎన్ని నిధులొచ్చాయి, ఎన్ని నిధులు ఖర్చు పెట్టింది అనేది కాగ్ విశ్లేషించి వాస్తవిక లెక్కలను వెల్లడిస్తుంది. ఈలోపు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను గొప్పగా చెప్పుకుంటూ అధికార పార్టీ మాత్రం కావాల్సినంత రాజకీయ ప్రయోజనాన్ని పొందుతుంది. మీడియా ద్వారా ఉచిత పబ్లిసిటీ సమకూరుతుంది. రెండేళ్ళ తర్వాత వచ్చే వాస్తవిక లెక్కలను ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోరు. ఇదే రాజకీయ పార్టీల ధీమా అని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం.

Tags: Telangana, KCR, Budget, Expenditure, CAG, Estimates, Political interests

Advertisement

Next Story